Hyderabad: ఈ ఏరియాలో ఫ్లాట్స్‌ అంటే హాట్‌కేకులే ! | Sakshi
Sakshi News home page

Hyderabad: ఈ ఏరియాలో ఫ్లాట్స్‌ అంటే హాట్‌కేకులే !

Published Sat, Dec 11 2021 4:28 PM

Realty Boom In Hyderabad At Bachupally Area - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లక్షలాది ఐటీ, ఐటీ ఆధారిత ఉద్యోగులకు ఉపాధి కేంద్రాలు మాదాపూర్, గచ్చిబౌలి. వీటికి సమీపంలో కొండాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, నిజాంపేట, కూకట్‌పల్లిలో ఇప్పటికే పెద్ద ఎత్తున నివాస సముదాయాలు వెలిశాయి. ఆయా ప్రాంతాలు జనావాసాలతో కిక్కిరిసిపోయాయి. దీంతో ఇప్పుడు ఐటీ ఉద్యోగులు అందుబాటు ధరల్లో గృహాలను కొనుగోలు చేసేందుకు ముందుగా ఎంపిక చేసే ప్రాంతం బాచుపల్లి. ఐటీ కార్యాలయాలకు దగ్గరగా ఉండటం, స్థానికంగా అంతర్జాతీయ విద్యా సంస్థలు, వినోద కేంద్రాలు, ఆసుపత్రులు ఉండటం బాచుపల్లికి అదనపు అంశాలు. 
అన్నీ చేరువే.. 
ఐటీ కారిడార్‌కు బాచుపల్లి సుమారు 15 కి.మీ. దూరం ఉంటుంది. మియాపూర్, కేపీహెచ్‌బీ వంటి వాణిజ్య కేంద్రాలు చేరువలో ఉన్నాయి. నిజాంపేట, ప్రగతినగర్, బౌరంపేట, మోమిన్‌పేట, గాజులరామారం ఇలా చుట్టూ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు రహదారులున్నాయి. మియాపూర్‌ నుంచి గండిమైసమ్మ మీదుగా మేడ్చల్‌ వరకు జాతీయ రహదారి ఉంది. పైగా ఈ ప్రాంతం ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు ఆనుకునే ఉండడంతో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా సులభంగా దూర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు. పారిశ్రామిక కేంద్రం పటాన్‌చెరు, జిల్లా కేంద్రం మేడ్చల్‌కు ఓఆర్‌ఆర్‌ దగ్గరి దారి. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు, హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌కు 10 కి.మీ. దూరం ఉంటుంది. జేన్‌టీయూ మెట్రో స్టేషన్‌కు 8 కి.మీ. ఇక్కడి నుంచి మెట్రోలో సిటీలోని ఏ ప్రాంతానికైనా నిమిషాల్లోనే చేరుకునే వీలుంది. 
ఏటా 20–30 శాతం వృద్ధి.. 
గత కొంత కాలంలో పశ్చిమ హైదరాబాద్‌లో ధరలు అబ్‌నార్మల్‌గా పెరుగుతున్నాయి. కానీ, బాచుపల్లి స్థిరాస్తి మార్కెట్‌ ఏటా 20–30 శాతం స్థిరమైన వృద్ధి నమోదవుతుందని ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కుమార్‌ కామరాజు తెలిపారు. తుది కొనుగోలుదారుల పెట్టుబడులకు సరైన విలువను అందించే మార్కెట్‌ ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ నిర్మాణ సంస్థ, ప్రాజెక్ట్‌ స్థాయిని బట్టి అపార్ట్‌మెంట్‌ ధరలు చ.అ. రూ.4 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. మధ్యతరగతి, సంపన్న వర్గాలకు అనుకూలమైన అపార్ట్‌మెంట్లు, లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌లు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడి మౌలిక, రవాణా సదుపాయాలు చూస్తుంటే సమీప భవిష్యత్తులో మియాపూర్, కేపీహెచ్‌బీ తరహాలో బాచుపల్లి ప్రాంతం శాటిలైట్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహమక్కర్లేదు. 
మౌలిక వసతులతో.. 
నిజాంపేట, బాచుపల్లి తదితర ప్రాంతాలను ఇది వరకు నీటి సమస్య వేధించేది. పూర్తిగా బోర్లపైనే ఆధారం. భూగర్భ జలాలు కలుషితమనే అపోహ ఉండేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. జల మండలి ప్రత్యేక లైన్లు వేయడంతో సమస్య తీరిపోయింది. పైగా గోదావరి, మిషన్‌ భగీరథ నీరు బాచుపల్లి ఏరియాకు వచ్చేశాయి. దీంతో గ్రౌండ్‌ వాటర్‌ మీద ఆధారం తగ్గింది. కాలుష్యం వెదజల్లే ఔషధ పరిశ్రమలు ఔటర్‌ బయటకు తరలిపోనుండటంతో ఈ ప్రాంతం నివాసాలకు మరింత ఆకర్షణీయంగా మారనుందని నిర్మాణదారులు పేర్కొంటున్నారు. భారీ భవంతులు, ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు. పెట్టుబడి దృష్ట్యా గతంలో కొన్న భూ ములను చాలా మంది అభివృద్ధికి ఇస్తున్నారు. అయితే బాచుపల్లి అభివృద్ధిని ముందుగా గుర్తించింది ప్రణీత్‌ గ్రూప్‌ అనే చెప్పాలి. ఎనిమిదేళ్ల క్రితం నుంచే బాచుపల్లి కేంద్రంగా విల్లా, అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. ఇప్పటి వరకు ఈ ఏరియాలో 2,500–3,000 గృహలను నిర్మించి కొనుగోలుదారులకు అందించిన ప్రణీత్‌ గ్రూప్‌.. ప్రస్తుతం 40–50 లక్షల చ.అ. పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. 

చదవండి: బాచుపల్లిలో క్లౌడ్‌ 33

Advertisement
Advertisement