3 నెలల కనిష్టానికి ఆర్‌ఐఎల్‌ షేరు | Sakshi
Sakshi News home page

3 నెలల కనిష్టానికి ఆర్‌ఐఎల్‌ షేరు

Published Mon, Nov 2 2020 12:13 PM

Reliance industries share hits 3 month low on weak Q2 results - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరచడంతో డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఆర్‌ఐఎల్‌ షేరు 5.5 శాతం పతనమైంది. రూ. 1,940కు చేరింది. ఇది మూడు నెలల కనిష్టంకాగా.. ప్రస్తుతం 5.3 శాతం నష్టంతో రూ. 1,946 వద్ద ట్రేడవుతోంది. ఇంతక్రితం జులై 21న షేరు ఇంట్రాడేలో రూ. 1935 స్థాయికి చేరినట్లు నిపుణులు తెలియజేశారు. అనుబంధ విభాగాలు రిలయన్స్‌ జియోతోపాటు.. రిలయన్స్‌ రిటైల్‌లో విదేశీ కంపెనీల పెట్టుబడుల వెల్లువతో సెప్టెంబర్‌ 16న ఆర్‌ఐఎల్‌ షేరు రూ. 2,369ను అధిగమించిన విషయం విదితమే. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. కొద్ది రోజులుగా ర్యాలీ బాటలో సాగిన ఆర్‌ఐఎల్‌ కౌంటర్లో ఫలితాల సందర్భంగా ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా.. షేరు వెనకడుగు వేయడంతో కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ. 74,000 కోట్లమేర చిల్లుపడగా.. ఇండెక్స్‌ హెవీవెయిట్‌కావడంతో స్టాక్‌ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు నిపుణులు వివరించారు.

క్యూ2 తీరిలా
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆర్‌ఐఎల్‌ నికర లాభం 15 శాతం క్షీణించి రూ. 9,567 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 26 శాతం నీరసించి రూ. 1.11 ట్రిలియన్లను తాకింది. ప్రధానంగా పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌ మందగించడం, రిఫైనింగ్‌ మార్జిన్లు క్షీణించడం వంటి అంశాలు కంపెనీ పనితీరును ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అనుబంధ విభాగాలు రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ మెరుగైన లాభదాయకతను సాధిస్తుండటం కంపెనీకి అదనపు బలాన్ని చేకూరుస్తున్నట్లు తెలియజేశారు. రిటైల్‌ విభాగంలో స్టోర్ల సంఖ్యను పెంచుకోవడం, ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు పుంజుకోనుండటం వంటివి సానుకూల అంశాలుగా పేర్కొన్నారు.

Advertisement
Advertisement