రూ.8,200కే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. విడుదల ఎప్పుడంటే.. | Sakshi
Sakshi News home page

రూ.8,200కే 5జీ స్మార్ట్‌ఫోన్‌.. విడుదల ఎప్పుడంటే..

Published Wed, Feb 28 2024 12:17 PM

Reliance Jio And Qualcomm Collaborate To Launch 5G Mobile  - Sakshi

భవిష్యత్తును శాసించే టెక్నాలజీల్లో 5జీ సాంకేతికత ప్రధానమైంది. మనం ప్రస్తుతం వాడుతున్న ఇంటర్‌నెట్‌ను కంటే మరింత వేగంగా అందించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్స్‌ వస్తువులు 5జీ టెక్నాలజీకి అనువుగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సాంకేతికతకు సరిపడే మొబైల్‌ఫోన్లను కొనుగోలు చేయాలి. అలాంటి వారికి రిలయన్స్‌, క్వాల్‌కామ్‌ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి.

తక్కువ ధరకే 5జీ చిప్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్‌ సంస్థ క్వాల్‌కామ్‌ తెలిపింది. ధర 99 డాలర్ల లోపు (సుమారు రూ.8,200) ఉండనుంది. గిగాబిట్‌ 5జీ స్పీడ్‌కు కట్టుబడి ఉన్నామని చెబుతూ... ఈ చిప్‌లో 2 యాంటెనా 5జీ స్టాండలోన్‌ (ఎస్‌ఏ- 2ఆర్‌ఎక్స్‌) సొల్యూషన్‌ ఉందని, దీని వల్ల ఈ ధరల విభాగంలోని 4జీ కంటే కూడా 5 రెట్ల వరకు అధిక వేగం ఉంటుందని పేర్కొంది. 

ఇదీ చదవండి: ప్రముఖ యాప్‌లో కాల్‌రికార్డింగ్‌ ఫీచర్‌..

ఫోన్లలో ఈ చిప్‌ను వాడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మందికి 5జీ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిప్‌తో కూడిన మొదటి ఫోను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ స్థాయి చిప్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేయడంతో భాగంగా రిలయన్స్‌ జియోతో పాటు ఇతర ఫోన్ల తయారీ కంపెనీలతో క్వాల్‌కామ్‌ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తుంది.

Advertisement
Advertisement