ఇన్‌కమ్ టాక్స్ నుంచి 143 (1) నోటీసు వచ్చిందా?..అప్పుడేం చేయాలి ?.. పూర్తి వివరాలు

8 Aug, 2022 13:50 IST|Sakshi

తగిన జాగ్రత్తలు తీసుకుని వేసినా.. యథాలాపంగా వేసినా.. మొక్కుబడిగా వేసినా.. మమ అనిపించినా 31–7–22 నాటికి రిటర్నులు వేయడం జరిగిపోయింది. ఏదేని కారణాన వేయకపోయినా.. ఒక అంచనా ప్రకారం గత సంవత్సరం వేసినంత మంది ఈసారి వేయలేదు. మరిచిపోయినా.. మానేద్దామనుకున్నా.. ఏదైనా సరే.. రిటర్నులు దాఖలు చేయండి. ఎప్పటికైనా రిటర్ను వేయటమే మంచిది.  

ప్రస్తుతం మీరు వేసే రిటర్నులను, వేయని వారితో వేయించి (దాఖలు), ఆ తర్వాత వేయించడం (మూకుడులో కాదు).. ఇలా అసెస్‌మెంట్‌ ప్రక్రియను సక్రమంగా, సత్వరంగా, సమగ్రంగా, సమిష్టిగా చేపట్టటానికి మొత్తం అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.  

సాధారణంగా మీరు ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన వెంటనే చాలా త్వరగా అసెస్‌మెంట్‌ అవుతుంది. ముఖ్యంగా పాన్‌తో అనుసంధానమైన కేసులో 24 గంటల్లోనే రిఫండు వచ్చిందంటే అతిశయోక్తి కాదు. చాలా మందికి రెండు మూడు రోజుల్లోనే వారి సెల్‌ఫోన్‌కి ఒక సందేశం వచ్చింది. ‘మీరు వేసిన రిటర్నుని ప్రాసెస్‌ చేశాం.. అంటే మీ ఇన్‌కం ట్యాక్స్‌ అసెస్‌మెంటు పూర్తి చేశాం. మీ రిజిస్టర్డ్‌ ఈ–మెయిల్‌కి సెక్షన్‌ 143 (1) సమాచారం పంపుతున్నాం. చెక్‌ చేసుకోండి. 

అందకపోతే మీ సిస్టంలో spam  (సాధారణంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులకు పంపే మెయిల్స్‌) వెళ్లి వెతకండి‘ అని సమాచారం వస్తోంది. కానీ ఈ సందేశం రాగానే, అది చదవగానే అందరూ భయపడుతున్నారు. ఏదో ‘శ్రీముఖం’ వచ్చిందని వాపోతున్నారు. దాఖలు చేసి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే నోటీసా అని నుదురు కొట్టుకుంటున్నారు. ఏమి కొంప మునిగిందిరా అని రామచంద్రుణ్ని తలుచుకుంటున్నారు. అప్పుడే ‘మొదలెట్టావా సీతమ్మ తల్లి’ అని ఆర్థిక మంత్రి సీతారామన్‌ గారి మీద శివమెత్తుతున్నారు. ఆగమేఘాల మీద ఆడిటర్‌గారి దగ్గరికి పరిగెడుతున్నారు. 

దయచేసి ఏమీ గాభరా పడక్కర్లేదు.ఎందుకంటే .. దీనర్థం ఏమిటంటే..
 

మీరు రిటర్ను వేసినట్లు (మీ బాధ్యత తీరింది) 

సదరు రిటర్ను అసెస్‌మెంట్‌ పూర్తయినట్లు (ఈ సంవత్సరం బెడద వదిలింది) 

ఆర్డరు మీ చేతిలో పడినట్లు (ఫైల్‌లో భద్రపర్చుకోండి) 

ఇది కేవలం సమాచారం మాత్రమే (ఉత్తర్వులు కాదు) 

రిఫండులు రావచ్చు (బ్యాంక్‌ అకౌంటు చెక్‌ చేసుకోండి) 

తప్పొప్పులు సరిదిద్దుతారు (సరిదిద్దుకోండి) 

మిమ్మల్ని చెల్లించమంటే, అది నిజమైతే చెల్లించండి 

అది తప్పయితే వివరణతో జవాబులివ్వండి 

 ఏ తప్పు లేకపోతే ఆర్డరు ఇవ్వరు 

 కొంత మంది కావాలని తప్పు చేసి, ఆర్డరు వచ్చాకా, డిమాండు చెల్లించి హమ్మయ్య అనుకుంటారు. 

 పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com ఈ–మెయిల్‌కు పంపించగలరు. 

మరిన్ని వార్తలు