రెండో రోజూ రూపాయి పరుగు | Sakshi
Sakshi News home page

రెండో రోజూ రూపాయి పరుగు

Published Thu, Dec 31 2020 11:51 AM

Rupee touches two months high vs dollar - Sakshi

ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ జోరు చూపుతోంది. ప్రస్తుతం డాలరుతో మారకంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడవుతోంది. ఇది రెండున్నర నెలల గరిష్టంకాగా.. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్‌ మార్కెట్లో తొలుత 15 పైసలు పుంజుకుని 73.16 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 73.05 వరకూ బలపడింది. బుధవారం సైతం డాలరుతో మారకంలో రూపాయి 11 పైసలు లాభపడి 73.31 వద్ద స్థిరపడింది. చదవండి: (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్‌)

కారణాలేవిటంటే..
ఇటీవల కొద్ది రోజులుగా డాలరు ఇండెక్స్‌ బలహీనపడుతోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 90 దిగువకు చేరింది. 89.64 వద్ద 32 నెలల కనిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2018 ఏప్రిల్‌లో మాత్రమే డాలరు ఇండెక్స్‌ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్‌ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం సెంటిమెంటు బలపడేందుకు దోహదం చేసినట్లు తెలియజేశాయి. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలరుతో మారకంలో యువాన్‌ 6.54ను తాకింది. 

దేశీ ఎఫెక్ట్‌
సెప్టెంబర్‌కల్లా కరెంట్‌ ఖాతా 15.5 బిలియన్‌ డాలర్ల మిగులుకు చేరినట్లు ఆర్‌బీఐ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల వెల్లువెత్తడం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దేశీ ఈక్విటీ మార్కెట్లో గత 12 ఏళ్లలోలేని విధంగా ఎఫ్‌పీఐలు నవంబర్‌లో 8 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డిసెంబర్‌లోనూ 5 బిలియన్‌ డాలర్లకుపైగా పంప్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020లో ఇప్పటివరకూ 22.6 బిలయన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం!

Advertisement
Advertisement