ఉద్యోగులకు భారీగా వేతనపెంపు.. ఎంతంటే.. | Sakshi
Sakshi News home page

సీనియర్‌ ఉద్యోగులకు భారీగా వేతనపెంపు

Published Mon, Apr 8 2024 12:29 PM

Salary Remain High For Senior Management Employees About 20 Percentage - Sakshi

కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగులకు 2024-25 ఏడాదికిగాను భారీగా వేతనాలు పెంపు ఉండనుందని మైఖేల్‌ పేజ్‌ ఇండియా శాలరీ గైడ్‌  2024 నివేదిక ద్వారా తెలిసింది. సగటున దాదాపు 20 శాతం మేర వార్షిక వేతనాలు పెరుగుతాయని నివేదికలో తెలిపారు. ఫైనాన్స్‌-అకౌంటింగ్‌, ఆరోగ్య సంరక్షణ లైఫ్‌సైన్సెస్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇంజినీరింగ్‌ తయారీ, మానవ వనరులు, లీగల్‌, టెక్నాలజీ తదితర రంగాల్లోని కంపెనీలు, ఉద్యోగులపై చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నివేదికలో ప్రధాన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 

తయారీ రంగాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మరింత డిమాండ్‌ పెరిగింది. టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో నైపుణ్యాలు పెంచుకుంటే ఉన్నత​ ఉద్యోగాలు అందుతున్నాయి. డేటా అనలిటిక్స్‌, జనరేటివ్‌ ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, ఎల్‌ఎల్‌ఎం వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వృత్తినిపుణులకు మరింత డిమాండ్‌ ఉండనుంది. ఆర్‌బీఐతోపాటు ప్రపంచ బ్యాంక్‌ వంటి సంస్థలు భారత వృద్ధిరేటుపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అందులో భాగంగా భారత జీడీపీ వృద్ధి స్థిరంగా 6 శాతంపైనే నమోదవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దాంతో ప్రస్తుతం అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులను తట్టుకుని భారత్‌ వృద్ధిబాట పడుతుందని నివేదికలో తెలిపారు. 

ఐటీ కంపెనీలు ఉద్యోగుల శాలరీ పెంపు విషయాన్ని సమీక్షిస్తున్నాయి. టెకీలకు సరాసరి 8-10 శాతం వేతనపెంపు ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఐటీ రంగంలో జూనియర్‌ ఉద్యోగులకు 35-45 శాతం, వారిపై ఉద్యోగులకు 30-40 శాతం, మేనేజ్‌మెంట్‌ స్థాయిలోని సీనియర్లకు 20-30 శాతం వేతన పెంపు ఉండొచ్చని నివేదిక ద్వారా తెలిసింది.

Advertisement
Advertisement