మార్కెట్లో ‘ఫెడ్‌’ అప్రమత్తత  | Sakshi
Sakshi News home page

మార్కెట్లో ‘ఫెడ్‌’ అప్రమత్తత 

Published Wed, Mar 16 2022 4:10 AM

Sensex Plunges 709 Points Dragged By Metal IT Shares: Nifty Ends At 16663 - Sakshi

ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వు సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకుంది. ఫలితంగా ఐదు రోజులుగా వరుస లాభాలతో దూసుకెళ్లిన బుల్‌కు మంగళవారం అడ్డుకట్టపడింది. ఆరంభ లాభాలన్ని నిలుపుకోవడంలో విఫలమైన సూచీలు చివరికి నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. మిడ్‌సెషన్‌ నుంచి ఆటో, ఎఫ్‌ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 709 పాయింట్లు క్షీణించి 55,777 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 208 పాయింట్లు నష్టపోయి 16,663 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ 30 షేర్లలో ఏడు మాత్రమే లాభపడ్డాయి. మెటల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఇటీవల ర్యాలీలో మెరిసిన మెటల్‌ షేర్లు భారీగా కరిగిపోయాయి. నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 4%, నిఫ్టీ గ్యాస్‌ అండ్‌ ఆయిల్‌ సూచీ 3శాతం చొప్పున నష్టపోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్‌ఈ స్మాల్, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌లు ఒకశాతం మేర క్షీణించాయి.

ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.2.26 లక్షల కోట్లు క్షీణించి రూ.2.51 లక్షల కోట్లకు దిగివచ్చింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,250 కోట్ల షేర్లను మాత్రమే విక్రయించారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.98 కోట్ల షేర్లను కొన్నారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ ఎనిమిది పైసలు క్షీణించి 76.62 వద్ద స్థిరపడింది. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్, కొరియా దేశాల స్టాక్‌ సూచీలు ఐదు శాతం దాకా క్షీణించాయి. జపాన్‌ నికాయ్‌ సూచీ మాత్రం  0.15 శాతం లాభంతో గట్టెక్కింది. యూరప్‌ మార్కెట్లు భారీ నష్టాలను తగ్గించుకొని అరశాతం పతనంతో ముగిశాయి.   

ఇంట్రాడే ట్రేడింగ్‌ ఇలా....  
ఐదు రోజుల ర్యాలీని కొనసాగిస్తూ మార్కెట్‌ మంగళవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 178 పాయింట్ల లాభంతో 56,664 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 16,901 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మిడ్‌సెషన్‌ నుంచి అమ్మకాలు గంటగంటకు పెరగడంతో సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోవడమే కాక నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 55,418 వద్ద, నిఫ్టీ 16,555 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.   

నష్టాలు ఎందుకంటే..? 
అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశం మంగళవారం రాత్రి ప్రారంభమైంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో కమిటీ ఎలాంటి ద్రవ్యపరమైన నిర్ణయాలు తీసుకుంటుందోనని ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ఉక్రెయిన్‌ రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధ విరమణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు.

ఒకవైపు సంధి చర్చలు జరుపుతూనే దాడిని తీవ్రతరం చేసిన రష్యాపై ప్రపంచదేశాలు మరిన్ని వాణిజ్య ఆంక్షలను విధించాయి. కరోనా కేసులు తిరిగి పెరుగుతుండంతో చైనాలో మళ్లీ లాక్‌డౌన్‌ను విధించారు. దేశీయ మార్కెట్‌ ఐదురోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో గరిష్టస్థాయిల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫిబ్రవరిలో రిటైల్‌ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్టానికి, టోకు ధరల ద్రవ్యోల్బణం అంచనాలకు మించి 13.11శాతంగా నమోదవడం సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం ఒత్తిడిని పెంచాయి. 

రూ.600 దిగువకు పేటీఎం షేరు 
పేటీఎం షేరు తొలిసారి రూ.600 దిగువున ముగిసింది. బీఎస్‌ఈలో మూడు శాతం లాభంతో రూ.695 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇంట్రాడేలో 13 శాతం క్షీణించి రూ.585 వద్ద జీవితకాల కనిష్టాన్ని తాకింది. చివరికి 12% నష్టంతో రూ.589 వద్ద స్థిరపడింది. గడచిన రెండురోజుల్లో పేటీఎం కంపెనీ రూ.11,809 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయింది.

తద్వారా కంపెనీ బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.38,418 కోట్లకు దిగివచ్చింది. పర్యవేక్షణ లోపాల కారణంగా కొత్త ఖాతాలను తెరవడం ఆపేయాలంటూ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను ఆర్‌బీఐ ఆదేశించడంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనవుతోంది. బీఎస్‌ఈ లిస్టింగ్‌ ధర (రూ. 2,150)తో పోలిస్తే మంగళవారం ముగింపు నాటికి షేరు మొత్తం 73 శాతం కుప్పకూలింది. 

మార్కెట్లో మరిన్ని సంగతులు  
పీఎల్‌ఐ పథకం కింద ఆమోదం పొందిన 75 కంపెనీలలో మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీలు ఉండటంతో ఈ షేర్లు రెండున్నర శాతం దాకా లాభపడ్డాయి. 
వడ్డీరేట్లను మైక్రో ఫైనాన్స్‌ ఇనిస్టిట్యూషన్స్‌ (ఎంఎఫ్‌ఐలు) నిర్ణయించుకునేందుకు ఆర్‌బీఐ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం బంధన్‌ బ్యాంక్‌కు కలిసొచ్చింది. బీఎస్‌ఈలో ఈ షేరు ఆరుశాతం లాభపడి రూ.281 వద్ద స్థిరపడింది.  
గ్రూప్‌ ప్రమోటర్, వ్యవస్థాపకుడు గెహ్లాట్‌ రాజీనామాతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 5% లాభపడి రూ.157 వద్ద నిలిచింది. 

Advertisement
Advertisement