సెన్సెక్స్‌ 889 పాయింట్లు క్రాష్‌ | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 889 పాయింట్లు క్రాష్‌

Published Sat, Dec 18 2021 5:13 AM

Sensex sinks 889 points; Nifty ends below 17,000 - Sakshi

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ వారాంతపు రోజున కుప్పకూలింది. దీంతో సూచీల లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. ఐటీ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ తలెత్తడంతో శుక్రవారం సెన్సెక్స్‌ 889 పాయింట్లు నష్టపోయి 57,011 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 263 పాయింట్లు పతనమైన 17,000 దిగువున 16,985 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. విస్తృత స్థాయి మార్కెట్లో అమ్మకాతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు రెండున్నర శాతం నష్టపోయాయి.

సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో కేవలం ఐదు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,070 కోట్ల ఈక్వటీ షేర్లు విక్రయించగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,479 కోట్ల షేర్లను కొన్నారు. రూపాయి ఇంట్రాడే నష్టాలను పూడ్చుకొని మూడుపైసల స్వల్ప లాభంతో 76.06 వద్ద స్థిరపడింది. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్‌ 1,775 పాయింట్లు, నిఫ్టీ 526 కోట్లు నష్టపోయాయి. ఆసియాలో చైనా, జపాన్, సింగపూర్, హాంకాంగ్‌ మార్కెట్లు రెండున్నర శాతం నష్టపోయాయి. యూరప్‌లోని ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్‌ దేశాల స్టాక్‌ సూచీలు ఒకటిన్నర శాతం పతనమయ్యాయి.  

ఏ దశలోనూ కోలుకోలేక...
మునుపటి లాభాల ముగింపునకు కొనసాగింపుగా ఉదయం స్టాక్‌ మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 121 పాయింట్లు పెరిగి 58,022 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 17,276 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆరంభంలో స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు లాభాలను నిలుపుకోవడంలో విఫలమయ్యాయి. ట్రేడింగ్‌ గడుస్తున్న కొద్దీ అమ్మకాల తీవ్రత పెరుగుతుండటంతో సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 950 పాయింట్లకు పైగా పతనమై.. 56951 వద్ద, నిఫ్టీ 282 పాయింట్లను కోల్పోయి 16,966 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.

నష్టాలు ఎందుకంటే...  
ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతర ద్రవ్య పాలసీ విధానాల అమలుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్‌ ఫెడ్‌ ప్రకటించింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్‌ సూచీలపై పడింది. కొత్త రకం వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు అంతకంతా పెరిగిపోతుండటంతో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ విధింపు ఆందోళనలు తెరపైకి వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు ఒత్తిడిని పెంచాయి. అధిక వెయిటేజీ షేర్లు రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు 3% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి.  

రూ.4.65 లక్షల కోట్లు సంపద ఆవిరి
స్టాక్‌ సూచీల ఒకటిన్నర శాతం పతనంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ శుక్రవారం.4.65 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో మొత్తం కంపెనీల విలువ రూ.260 లక్షల కోట్లకు దిగివచ్చింది.  

టెక్‌ షేర్లకు యాక్సెంచర్‌ జోష్‌..!
ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ వచ్చే ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచడంతో   దేశీయంగా లిస్టెడ్‌ దిగ్గజ కంపెనీలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ ఇండెక్స్‌ ఒకటిన్నర శాతం లాభపడింది. అంతే కాకుండా నిఫ్టీ–50 సూచీలో లాభంతో ముగిసిన మొత్తం ఐదు షేర్లలో ఈ రంగ షేర్లే మూడు కావడం విశేషం.

మార్కెట్లో మరిన్ని సంగతులు...  
► సమీర్‌ గెహ్లాట్‌ పారీస్‌ సంస్థ తన మొత్తం వాటాలో 12% వాటాను విక్రయించడంతో ఇండియాబుల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు బీఎస్‌ఈలో ఎనిమిదిన్నర శాతం నష్టపోయి రూ.233 వద్ద ముగిసింది.
► వ్యాపార పునర్‌నిర్మాణ ప్రణాళికతో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేరు రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. బీఎస్‌ఈలో మూడుశాతం లాభపడి రూ.1,300 వద్ద నిలిచింది.


లిస్టింగ్‌లో చతికిలబడిన రేట్‌గెయిన్‌ ట్రావెల్‌   
ట్రావెల్‌ టెక్నాలజీస్‌ రేట్‌గెయిన్‌ షేర్లు లిస్టింగ్‌లో చతికిలపడ్డాయి. బీఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.425తో పోలిస్తే రూ.364 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 21 శాతం మేర క్షీణించి రూ.334 వద్ద స్థాయికి దిగివచ్చింది. చివరికి 20% నష్టంతో రూ.340 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.3,635 కోట్ల వద్ద స్థిరపడింది.

హెచ్‌పీ అడెసివ్స్‌ ఐపీవోకు సానుకూల స్పందన
హెచ్‌పీ అడెసివ్స్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో)కు ఇన్వెస్టర్ల నుంచి సానుకూల స్పందన లభించింది. ఐపీవోలో భాగంగా 25,28,500 షేర్లను ఆఫర్‌ చేయగా, 5,29,89,650 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 81 రెట్లు అధిక స్పందన లభించించగా, నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోటాలో 19 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐపీ) విభాగం 1.82 రెట్ల స్పందన అందుకుంది. ఒక్కో షేరుకు రూ.262–274 ధరల శ్రేణిని కంపెనీ ప్రకటించగా, గరిష్ట ధరకే షేర్లను ఇష్యూ చేయనుంది.   

Advertisement
Advertisement