ఒడిదుడుకుల ట్రేడింగ్‌ అయినా లాభాలే | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల ట్రేడింగ్‌ అయినా లాభాలే

Published Thu, Oct 22 2020 5:03 AM

Sensex Slumps Over 800 Points From Day High - Sakshi

ముంబై: ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు బుధవారం లాభాల్లోనే ముగిశాయి. చివరి గంటలో జరిగిన కొనుగోళ్లు సూచీలను లాభాల బాట పట్టించాయి. సెన్సెక్స్‌ 163 పాయింట్లు పెరిగి 40,707 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లను ఆర్జించి 11,938 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకిది వరుసగా 4వ రోజూ లాభాల ముగింపు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ఐటీ, ఆటో, ఇంధన, ఎఫ్‌ఎంసీజీ, మీడియా షేర్లలో విక్రయాలు జరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 826 పాయింట్ల రేంజ్‌ లో కదలాడింది. నిఫ్టీ 242 పాయింట్ల్ల మధ్య ఊగిసలాడింది.  

ఆరంభం ఆదిరింది...
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతను అందుకున్న మార్కెట్‌ భారీ గ్యాప్‌ అప్‌తో మొదలైంది. సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ లాభాలతో 40,767 వద్ద, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 11,958 వద్ద ట్రేడింగ్‌ను షురూ చేశాయి. కేంద్రం నుంచి మరో ఉద్దీపన ప్యాకేజీ రావచ్చనే అంచనాలతో ఉదయం సెషన్‌లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. బ్యాంకింగ్, ఆర్థిక, మెటల్‌ షేర్ల ర్యాలీ అండతో సెన్సెక్స్‌ 432 పాయింట్లు పెరిగి 40,976 వద్ద, నిఫ్టీ 12,000 మార్కును అందుకొని 12,019 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి.  

మిడ్‌సెషన్‌లో అమ్మకాల సునామీ...
మిడ్‌సెషన్‌ వరకు కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో టీసీఎస్‌ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది.  ఒక దశలో సెనెక్స్‌ గరిష్టస్థాయి 40,976 నుంచి ఏకంగా 826 పాయింట్లను కోల్పోయి 40,150 కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టస్థాయి 12,018 నుంచి 242 పాయింట్లు నష్టపోయి 11,776 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చింది.

Advertisement
Advertisement