నేడు నష్టాల ఓపెనింగ్‌! ఆపై కన్సాలిడేషన్‌? | Sakshi
Sakshi News home page

నేడు నష్టాల ఓపెనింగ్‌! ఆపై కన్సాలిడేషన్‌?

Published Fri, Jul 24 2020 8:22 AM

SGX Nifty indicates Market may open weak today - Sakshi

నేడు (24న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 62 పాయింట్లు బలహీనపడి 11,155 వద్ద ట్రేడవుతోంది. గురువారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 11,217 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ప్రధానంగా టెక్నాలజీ దిగ్గజాలలో అమ్మకాలు ఊపందుకోవడంతో గురువారం యూఎస్‌ మార్కెట్లు 1.3-2.3 శాతం మధ్య క్షీణించాయి. యూరోపియన్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు నిలవగా.. ప్రస్తుతం ఆసియాలో అత్యధిక శాతం మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. ఇండొనేసియా, హాంకాంగ్‌, సింగపూర్‌, చైనా 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభంకావచ్చని, తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

38,000కు సెన్సెక్స్
ఒక్క రోజు కన్సాలిడేషన్‌ తదుపరి గురువారం దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరందుకున్నాయి. సమయం గడిచేకొద్దీ బలాన్ని పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 269 పాయింట్లు జంప్‌చేసి 38,140 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ సైతం 83 పాయింట్ల లాభంతో 11,215 వద్ద నిలిచింది. అయితే వరుసగా రెండో రోజు మార్కెట్లు కన్సాలిడేట్‌ అయ్యాయి. దీంతో ఇంట్రాడేలో నిఫ్టీ 11240 వద్ద గరిష్టాన్నీ, 11103 వద్ద కనిష్టాన్నీ తాకింది.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  11,133 పాయింట్ల వద్ద, తదుపరి 11,050 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 11,269 పాయింట్ల వద్ద, ఆపై 11,323 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 22,838 పాయింట్ల వద్ద, తదుపరి 22,593వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 23,226 పాయింట్ల వద్ద, తదుపరి 23,368 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల పెట్టుబడులు
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1740 కోట్లకుపైగా విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 932 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. బుధవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1666 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా..  డీఐఐలు రూ. 1139 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement