ఇన్వెస్టర్లకు కాసులవర్షం కురిపిస్తోన్న హైదరాబాద్‌ కంపెనీ..! | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్లకు కాసులవర్షం కురిపిస్తోన్న హైదరాబాద్‌ కంపెనీ..!

Published Tue, Jan 4 2022 3:55 PM

Shares of this electric bus maker have surged 540 in the last 12 months - Sakshi

స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్టర్లకు హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ కాసుల వర్షం కురుపిస్తోంది. గత 12 నెలలో ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ షేర్‌ విలువ ఏకంగా 540 శాతం ఎగబాకి ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందజేసింది. సరిగ్గా 12 నెలల క్రితం కంపెనీలో పదివేల పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు  ఇప్పుడు రూ . 67000 రాబడిని అందించింది ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌. 

భారత్‌లోనే అతిపెద్ద సంస్థగా..!
హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ భారత్‌లో ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో అతిపెద్ద సంస్థ నిలుస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాల మార్కెట్‌లో దాదాపు 40 శాతం వాటాలను ఒలెక్ట్రా కల్గి ఉంది. ఈ సంస్థ చైనాకు చెందిన అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. 


 

హైదరాబాద్‌లో భారీ ప్లాంట్‌..!
ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఇప్పటికే పలు దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు దృష్టిసారించాయి. అయితే వీరు కేవలం టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలపైనే ఎక్కువగా దృష్టిసారించారు. హెవీ వెహికిల్స్‌పై ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ దృష్టిసారించింది. అందులో భాగంగా  2020 డిసెంబర్లో, హైదరాబాద్ శివార్లలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీని ప్రారంభ వ్యయం సుమారు రూ. 600 కోట్లు. 10,000 యూనిట్ల సామర్థ్యంతో 150 ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు.



 

షేర్‌ ధర ఎందుకు పెరుగుతోంది..!
ఒలెక్ట్రా గ్రీన్‌ టెక్‌ షేర్‌ ధర గత ఏడాది నుంచి కొత్త రికార్డులను నమోదుచేస్తోంది. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో భారత్‌లోని ఆయా రాష్ట్రాలు ప్రజారవాణా కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను వాడేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు ఒలెక్ట్రా ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం భారీ ఆర్డర్స్‌ను ఇచ్చాయి. అంతేకాకుండా   దీంతో కంపెనీ షేర్‌ విలువ గణనీయంగాపెరుగుతోంది. 


 

భవిష్యత్తు ఎలా ఉందంటే...?
ప్రజారవాణా కోసం పలు రాష్ట్రప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టిసారించడంతో కంపెనీ భవిష్యత్తుపై ఎలాంటి ఢోకా లేదని నిపుణులు పేర్కొన్నారు. దాంతో పాటుగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌కు మరో 6 వేల బస్సుల కోసం కంపెనీ టెండర్లు దాఖలు చేసిందని ఒలెక్ట్రా చైర్మన్ కెవి ప్రదీప్ తెలిపారు. ప్రభుత్వ రవాణా సంస్థకు మరో 50 ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేయడానికి బిడ్‌ను గెలుచుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్‌ బస్సులనే కాకుండా ఎలక్ట్రిక్‌ ట్రక్కులను కూడా రూపొందించాలని ఆయా సంస్థలతో కంపెనీ జత కట్టింది. 2022-23లో వాటి  ఎలక్ట్రిక్‌ ట్రక్కులను ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చైనాకు చెందిన బీవైడీ సంస్థ భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకోవాలని కంపెనీ చూస్తోన్నట్లు సమాచారం. 

చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..!

Advertisement
Advertisement