కొత్త మాల్స్‌ వస్తున్నాయ్‌! | Sakshi
Sakshi News home page

కొత్త మాల్స్‌ వస్తున్నాయ్‌!

Published Fri, Oct 15 2021 9:18 AM

Shopping Mall Business Revamped Before Corona Level - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారితో పాతాళంలోకి పడిపోయిన షాపింగ్‌ మాల్స్‌ వ్యాపారం... తిరిగి క్రమంగా పుంజుకుంటోంది. దీంతో మాల్స్‌ నిర్మాణ సంస్థలకూ జోష్‌ వచ్చింది. ఈ ఏడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 45 లక్షల చదరపు అడుగుల షాపింగ్‌ మాల్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో 85 శాతం స్పేస్‌ ప్రధాన నగరాలలో, 15 శాతం ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో రానుంది. ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి రానున్న రిటైల్‌ మాల్‌ స్పేస్‌లో బెంగళూరులో 12.2 లక్షల చదరపు అడుగుల మాల్‌ స్పేస్, ముంబై, నోయిడాలలో ఒక్కో నగరంలో 11 లక్షల చదరపు అడుగుల స్పేస్‌ రానుంది. అమరావతి, లక్నో పట్టణాలలో కొత్తగా రెండు మాల్స్‌లలో 4.7 లక్షల స్క్వేర్‌ ఫీట్‌లలో రానున్నాయి. 

గతేడాది 75 శాతం క్షీణత.. 
2019లో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో కొత్తగా 85 లక్షల చ.అ. మాల్‌ స్పేస్‌ అందుబాటులోకి వచ్చింది. అంతకుక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 73 శాతం వృద్ధి. గతేడాది కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా చాలా వరకు ఇంటికే పరిమితం అయ్యారు. అవసరమైన వస్తువులు, నిత్యావసరాలను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో భౌతిక రిటైల్‌ స్పేస్‌ అవసరం క్షీణించింది. ఫలితంగా 2019తో పోలిస్తే గతేడాది కొత్త రిటైల్‌ మాల్‌ స్పేస్‌ 75 శాతం క్షీణించి.. 21 లక్షల చదరపు అడుగులకు చేరింది. 
 

మన దగ్గర తలసరి రిటైల్‌ స్పేస్‌ 2 చదరపు అడుగులు
అమెరికా, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో సంఘటిత రిటైల్‌ వ్యాపారం 10 శాతం కంటే తక్కువే. యూఎస్‌లో తలసరి వ్యవస్థీకృత రిటైల్‌ స్పేస్‌ 23 చ.అ., దుబాయ్‌లో 16 చ.అ. ఉండగా... మన దేశంలో మాత్రం 2 చ.అ.లుగా ఉంది. గత ఐదేళ్లలో భారతదేశ తలసరి ఆదాయం 12 శాతం వృద్ధి రేటుతో 1,961 డాలర్లకు పెరిగిందని అనరాక్‌ రిటైల్‌ సీఓఓ అండ్‌ జాయింట్‌  ఎండీ పంకజ్‌ రెంజెన్‌ తెలిపారు. ఏటా సంఘటిత దేశీయ రిటైల్‌ మార్కెట్‌ 20–25 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. 

చదవండి: లగ్జరీ అపార్ట్‌మెంట్స్‌ కేరాఫ్‌ హైదరాబాద్‌

Advertisement
Advertisement