మరో రాకెట్‌ను ప్రయోగించనున్న స్కైరూట్‌.. తేదీ ఎప్పుడంటే.. | Sakshi
Sakshi News home page

మరో రాకెట్‌ను ప్రయోగించనున్న స్కైరూట్‌.. తేదీ ఎప్పుడంటే..

Published Tue, Oct 24 2023 8:59 PM

Skyroot To Launch Another Rocket - Sakshi

అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. అంతర్జాతీయంగా స్పేస్‌ఎక్స్‌ వంటి ప్రైవేట్‌ కంపెనీలు రాకెట్లును పంపుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ మనదేశంలో ఇస్రో తప్పించి రాకెట్లు తయారు చేసిన సంస్థ మరొకటేదీ లేదు. తొలిసారిగా హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ గతేడాది విక్రమ్‌-ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంతో విక్రమ్‌-1ను లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతుంది.

స్కైరూట్‌ సంస్థ రూపొందించిన ‘విక్రమ్‌-1’ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రధానకార్యాలయం(మ్యాక్స్‌-క్యూ)ను మంత్రి సందర్శించి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న స్పేస్, బయోటెక్, అగ్రికల్చర్ రంగాల్లో యువతకు అపారఅవకాశాలు ఉన్నాయని తెలిపారు.  సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో స్టార్టప్‌ సంస్థల సామర్థ్యాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించాలని ప్రధాని మోదీ కాంక్షిస్తున్నారని చెప్పారు.

స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ చందన మాట్లాడుతూ అసాధారణమైన వాటిని సాధించినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. స​ంస్థ సీఓఓ భరత్ డాకా మాట్లాడుతూ విక్రమ్‌-1 డిజైన్ దేశీయంగా తయారుచేసినట్లు చెప్పారు.

విక్రమ్-1 దాదాపు 300కిలోల పేలోడ్‌ను భూదిగువ కక్ష్యలోకి మోసుకెళ్లే రాకెట్‌. ఈ ప్రయోగం వివిధ దశల్లో జరుగుతుంది. దీన్ని పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. విక్రమ్‌-1ను 2024లో ప్రయోగించనున్నారు. స్కైరూట్‌ క్యార్యాలయం అయిన మ్యాక్స్‌-క్యూలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్‌తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 300 మంది పనిచేసేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement