భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ ధరలు - కారణం ఇదే..

6 Feb, 2024 10:56 IST|Sakshi

2024 జూన్ నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరిగే సూచనలున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకంటే సుమారు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో వచ్చే త్రైమాసికం నుంచి స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగనున్నట్లు సమాచారం.

మార్కెట్ పరిశోధన సంస్థ ట్రెండ్‌ఫోర్స్ DRAM (మెమరీ చిప్స్) ధరలలో పెరుగుదల ఉందని సూచించింది. ఎందుకంటే శాంసంగ్, మైక్రాన్ కంపెనీలు మార్చి నుంచి ధరల పెరుగుదలను అమలు చేసే అవకాశం ఉంది. ఆ ప్రభావం స్మార్ట్‌ఫోన్‌లపై కూడా ఉంటుందని ట్రెండ్‌ఫోర్స్ తెలిపింది.

స్మార్ట్‌ఫోన్, పర్సనల్ కంప్యూటర్ల వినియోగం భారీగా పెరగడం వల్ల ఏఐ, అధిక పనితీరు కలిగిన మెమొరీ చిప్‌ల డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు చిప్‌ల ధరలను పెంచనున్నాయి. ఇది మాత్రమే కాకుండా.. చైనీస్ కరెన్సీ యువాన్ బలపడటం వల్ల, అక్కడ నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాల ఖర్చు కూడా భారీగానే ఉన్న కారణంగా ధరలు పెరుగుతాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఆ కంపెనీ ఉద్యోగుల జాబ్స్ పోయినట్టేనా? సీఈఓ ఏమన్నారంటే..

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించింది. ఇది స్మార్ట్‌ఫోన్ పరిశ్రమకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం బడ్జెట్‌ను పెంచింది. అయినప్పటికీ ఇప్పటికే తయారై సరఫరాకు సిద్దమైన ఫోన్స్ ధరలు 3 నుంచి 8 శాతం, కొత్తగా తయారవుతున్న ఫోన్ల మీద 5 నుంచి 10 శాతం ధరలు పెరగవచ్చని, డిమాండ్‌ను బట్టి ధరలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega