ఐపీవో రష్‌.. లాభాల జాతర | Sakshi
Sakshi News home page

ఐపీవో రష్‌.. లాభాల జాతర

Published Mon, Jan 1 2024 6:26 AM

Stock markets hit new records with historic highs and primary markets hit new highs - Sakshi

గత క్యాలండర్‌ ఏడాది(2023)లో పబ్లిక్‌ ఇష్యూల హవా నడిచింది. ఓవైపు స్టాక్‌ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలతో సరికొత్త రికార్డులు సృష్టిస్తే.. మరోపక్క ప్రైమరీ మార్కెట్లు పలు కొత్త
కంపెనీల లిస్టింగ్స్‌తో కళకళలాడాయి. వీటిలో అత్యధిక శాతం ఇష్యూలు ఇన్వెస్టర్లను మెప్పించడం విశేషం!

ముంబై: స్టాక్‌ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్సులలో సెన్సెక్స్‌(బీఎస్‌ఈ) 72,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నూతన చరిత్రకు తెరతీసింది. ఈ బాటలో నిఫ్టీ(ఎన్‌ఎస్‌ఈ) సైతం తొలిసారి 22,000 పాయింట్ల మార్క్‌కు చేరువైంది. ఈ ప్రభావంతో 2023లో పలు అన్‌లిస్టెడ్‌ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు తెరతీశాయి. ఇందుకు అనుగుణంగా కొద్ది నెలలనుంచి పెట్టుబడుల దూకుడు చూపుతున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు పబ్లిక్‌ ఇష్యూలకు దరఖాస్తు చేయడంలో క్యూ కట్టారు. వెరసి 2023లో మార్కెట్లను తాకిన 59 ఐపీవోలలో ఏకంగా 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ద్వారా రికార్డు నెలకొల్పాయి. 4 కంపెనీలు మాత్రమే పబ్లిక్‌ ఇష్యూ ధరలకంటే దిగువన కదులుతున్నాయి.  

రూ. 82 లక్షల కోట్లు
గతేడాది(జనవరి–డిసెంబర్‌) దేశీ స్టాక్‌ మార్కెట్లు దాదాపు 20 శాతం ర్యాలీ చేశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 82 లక్షల కోట్లమేర(ఒక ట్రిలియన్‌ డాలర్లు) బలపడింది. ఫలితంగా లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 370 లక్షల కోట్లకు(4.3 ట్రిలియన్‌ డాలర్లు) చేరింది. 2022తో పోలిస్తే 30 శాతం వృద్ధి! తద్వారా గ్లోబల్‌ టాప్‌–5 విలువైన మార్కెట్ల జాబితాలో భారత్‌ చోటు సాధించింది.

సగటున 45 శాతం ప్లస్‌
గతేడాది స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన 59 కంపెనీలు ఉమ్మడిగా రూ. 54,000 కోట్లు సమీకరించాయి. వీటిలో 55 ఇష్యూలు ఇన్వెస్టర్లకు లాభాలను పంచాయి. ఇవి సగటున 45 శాతం బలపడ్డాయి. అయితే 4 కంపెనీలు ఇష్యూ ధర కంటే దిగువన ట్రేడవుతున్నాయి. 59 ఇష్యూలలో లిస్టింగ్‌ రోజు లాభాలు సగటున 26 శాతంకాగా.. డిసెంబర్‌ 29కల్లా సగటున 45 శాతం పురోగమించాయి. 4 ఇష్యూలు మాత్రమే బలహీనంగా ట్రేడవుతున్నాయి. లిస్టింగ్‌ నుంచి 23 కంపెనీలు 50 శాతానికిపైగా రిటర్నులు అందించాయి! 9 ఇష్యూలు రెట్టింపునకుపైగా లాభపడ్డాయి. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్‌ఎంఈలు) నుంచి 182 ఐపీవోలు నమోదయ్యాయి. ఇది 56 శాతం వృద్ధికాగా.. ప్రపంచంలోనే అత్యధికం!!

టాప్‌లో పీఎస్‌యూ
ఐపీవోలలో ప్రభుత్వ రంగ కంపెనీ ఇండియన్‌ రెనెవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(ఇరెడా) అత్యధికంగా 205 శాతం దూసుకెళ్లి రిటర్నుల జాబితాలో టాప్‌ ర్యాంకును అందుకుంది. ఈ బాటలో సైయెంట్‌ డీఎల్‌ఎమ్‌ 155 శాతం, నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ 141 శాతం చొప్పున జంప్‌చేసి తదుపరి స్థానాల్లో నిలిచాయి. టాటా గ్రూప్‌ కంపెనీ టాటా టెక్నాలజీస్‌ లిస్టింగ్‌లో మూడు రెట్లు ఎగసి ప్రస్తుతం 136 శాతం లాభంతో కదులుతోంది. ఇక రియల్టీ సంస్థ సిగ్నేచర్‌ గ్లోబల్‌ 128 శాతం ర్యాలీ చేసింది. ఈ నేపథ్యంలో 240 ఇష్యూల ద్వారా 60 బిలియన్‌ డాలర్లు సమీకరించిన చైనా తదుపరి భారత్‌ అత్యధిక ఐపీవోల మార్కెట్‌గా నిలిచింది.

కారణాలున్నాయ్‌
బలమైన స్థూల ఆర్థిక మూలాలు, రాజకీయ నిలకడ, ఆశావహ కార్పొరేట్‌ ఫలితాలు, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ పెంపు నిలుపుదల తదితర అంశాలు స్టాక్‌ మార్కెట్ల ర్యాలీకి కారణమైనట్లు పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి రూ. 1.7 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు దేశీ మార్కెట్లలోకి ప్రవహించాయి. మరోపక్క గతేడాది సుమారు 2.7 కోట్లమంది కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్లలో ప్రవేశించడం గమనార్హం! మధ్య, చిన్నతరహా కంపెనీలు దూకుడు చూపడంతో ఐపీవో ఇండెక్స్‌ 41 శాతం జంప్‌చేసింది. గతేడాది మార్చిలో నమోదైన కనిష్టం 57,085 పాయింట్ల నుంచి సెన్సెక్స్‌ డిసెంబర్‌ 28కల్లా 72,484 పాయింట్లకు పురోగమించింది!

Advertisement

తప్పక చదవండి

Advertisement