సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు

25 Sep, 2023 07:54 IST|Sakshi

ఇన్ఫోసిన్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రచయిత్రి సుధా మూర్తి బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించారు.రెండు వేర్వేరు ఘటనల్లో తన పేరును ఉపయోగించి లావణ్య, శ్రుతి అనే పేరుతో ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడ్డారంటూ ఆమె తరఫున తన ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్ మమత సంజయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

మమత సంజయ్‌ ఫిర్యాదు మేరకు .. 2023 ఏప్రిల్‌ 5న సుధా మూర్తికి ఓ ఈమెయిల్‌ వచ్చింది. కన్నడ కూట ఆఫ్‌ నార్తన్‌ కాలిఫోర్నియా (కేకేఎన్‌సీ) సంఘం 50వ వార్షికోత్సవానికి అధితులుగా రావాలనేది ఆ మెయిల్‌ సారాంశం. అయితే అదే నెల ఏప్రిల్‌ 26న ఆ మెయిల్‌కు సుధా మూర్తి ఆఫీస్‌ ప్రతినిధులు స్పందిస్తూ.. బిజీ షెడ్యూల్‌ వల్ల కేకేఎన్‌సీ ఈవెంట్‌కు రాలేరని సమాధానం ఇచ్చారు.  

సుధా మూర్తి పర్సనల్‌ అసిస్టెంట్‌గా 
కానీ ఆగస్టు 30న మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారంటూ ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుధా మూర్తి కేకేఎన్‌సీ నిర్వాహకుల నుంచి వివరాల్ని సేకరించారు. ఈ సందర్భంగా తాను సుధామూర్తి పర్సనల్ అసిస్టెంట్‌గా పరిచయం చేసుకున్న లావణ్య అనే మహిళ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తేలింది. అంతేకాదు ఆమె పలువురిని నుంచి నగదు వసూలు చేసినట్లు తేలింది. 

ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు
అమెరికాలో ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి సుధా మూర్తి హాజరవుతున్నారంటూ శ్రుతి అనే మరో మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లావణ్య, శ్రుతి పేరుతో మోసం చేసిన వారిపై సుధా మూర్తి వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ మోసానికి పాల్పడిన మహిళలు ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఆ ఇద్దరు మహిళలపై ఐపీసీ-419 (మోసం), 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-66(సి), 66(డి) సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 

మరిన్ని వార్తలు