టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ

31 Aug, 2021 04:04 IST|Sakshi

టెలికం రంగానికి పన్నుల భారం

ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 200కి ఏఆర్‌పీయూ

భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌

న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్‌ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్‌టెల్‌ వెనక్కి తగ్గబోదు.

(చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్‌ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్‌పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు