భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! మరిన్నింటిపై ప్రభావం.. కారణం.. | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర.. మరిన్ని వస్తు ధరలపై ప్రభావం

Published Mon, Mar 11 2024 5:30 PM

Swiss Watches Chocolates To Get Cheaper With EFTA Agreement - Sakshi

యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్‌ ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ)తో భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకూ హామీ లభించింది. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది.

ఈ ఒప్పందంతో ప్రధానంగా స్విస్‌ వాచీలు, పాలిష్‌ చేసిన వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, లిక్టన్‌స్టైన్‌, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్‌టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది.

ఉపయోగాలివే..

దేశీయంగా తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్‌టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్‌ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకూ సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన ఉత్పత్తులపై ఈ ఏడాది జనవరి నుంచే స్విట్జర్లాండ్‌ సుంకాలను తొలగించింది.

భారత్‌ కూడా ఈఎఫ్‌టీఏ ఉత్పత్తుల్లో 95.3 శాతానికి మినహాయింపు ఇస్తోంది. అక్కడ నుంచి బంగారం మనదేశంలోకి అధికంగా దిగుమతి అవుతున్నా, కస్టమ్స్‌ సుంకం (15%) విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్‌రేటు (అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది)ను మాత్రం 1% తగ్గించి, 39%గా ఉంచింది. ఐరోపా సమాఖ్యకు చేరేందుకు భారత కంపెనీలు స్విట్జర్లాండ్‌ను బేస్‌గా వినియోగించుకోవచ్చు. ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌, హెల్త్‌ సైన్సెస్‌, పునరుత్పాదక ఇంధనం, వినూత్నత-పరిశోధనల్లో సాంకేతిక సహకారం సులువవుతుంది.

మారనివి ఇవే..

డెయిరీ, సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు.

ఇదీ చదవండి: విద్యుత్‌ వాహనాలతో వాతావరణ కాలుష్యం..!

స్విట్జర్లాండ్‌ నుంచి భారత్‌ ఎక్కువగా బంగారం (12.6 బి.డాలర్లు), యంత్రాలు (409 మి.డాలర్లు), ఔషధాలు (309 మి.డాలర్లు), కోకింగ్‌ అండ్‌ స్టీమ్‌ కోల్‌ (380 మి.డాలర్లు), ఆప్టికల్‌ ఇన్‌స్ట్రుమెంట్లు, ఆర్థోపెడిక్‌ అప్లియెన్సెస్‌ (296 మి.డాలర్లు), వాచీలు (211.4 మి.డాలర్లు), సోయాబీన్‌ ఆయిల్‌ (202 మి.డాలర్లు) చాక్లెట్లు (7 మి.డాలర్లు) తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రసాయనాలు, రత్నాభరణాలు, కొన్ని రకాల టెక్స్‌టైల్స్‌, దుస్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది.

Advertisement
Advertisement