స్పెక్ట్రం వేలం షురూ

2 Mar, 2021 05:52 IST|Sakshi

అమ్మకానికి 2,308 మెగాహెట్జ్‌ 

బేస్‌ ధర రూ. 3.92 లక్షల కోట్లు

తొలి రోజు రూ. 77,146 కోట్ల బిడ్లు

న్యూఢిల్లీ: దాదాపు రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే టెలికం స్పెక్ట్రం వేలం సోమవారం ప్రారంభమైంది. తొలి రోజున రూ. 77,146 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ తెలిపారు. బిడ్డింగ్‌కు స్పందన ప్రభుత్వం ఊహించిన దానికంటే మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం బ్యాండ్స్‌ అయిన 700, 2500 మెగాహెట్జ్‌ స్పెక్ట్రం కోసం ఏ కంపెనీ బిడ్‌ చేయలేదని చెప్పారు. మంగళవారం కూడా వేలం కొనసాగించి, ముగించనున్నామని వివరించారు. ‘సోమవారం సాయంత్రం 6 గం.ల దాకా రూ. 77,146 కోట్ల బిడ్లు వచ్చాయి. కేవలం మూడు సంస్థలే పోటీపడుతున్నాయి.. అది కూడా గత స్పెక్ట్రంనే రెన్యూ చేసుకోనున్నాయి కాబట్టి బిడ్లు మహా అయితే రూ. 45,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మేం అంచనా వేశాం. అయితే దానికి మించి బిడ్లు వచ్చాయి’ అని ప్రసాద్‌ తెలిపారు. బిడ్డర్ల వారీగా వివరాలు వెల్లడి కానప్పటికీ దాదాపు 849.20 మెగాహెట్జ్‌ పరిమాణానికి బిడ్లు వచ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొదటి రోజున నాలుగు రౌండ్లు జరిగాయి.  

700 మెగాహెట్జ్‌కు దూరం..
‘మొత్తం వేలానికి ఉంచిన స్పెక్ట్రం విలువ దాదాపు రూ. 4 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌.. అత్యంత ఖరీదైనది. దీని విలువే ఏకంగా రూ. 1.97 లక్షల కోట్లు ఉంటుంది’ అని ప్రసాద్‌ తెలిపారు. 5జీ సేవలకు ఉపయోగపడే 700 మెగాహెట్జ్‌ బ్యాండ్‌కు 2016లో నిర్వహించిన వేలంలో కూడా స్పందన లభించలేదు. ఒకవేళ రేటు కారణంగా ప్రస్తుత వేలంలోనూ అమ్ముడు కాకపోయిన పక్షంలో దీనిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.   కరోనా వైరస్‌ పరిణామాలతో ఎకానమీ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వేలం జరుగుతున్నప్పటికీ.. ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తుండటం సానుకూలాంశమని ప్రసాద్‌ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5జీ స్పెక్ట్రం వేలం జరిగే అవకాశం ఉందని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్‌ చెప్పారు.  

దూకుడుగా జియో..
వేలంలో పాల్గొంటున్న మూడు ప్రైవేట్‌ టెలికం దిగ్గజాలు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా కలిపి రూ.13,475 కోట్లు ముందస్తు డిపాజిట్‌ (ఈఎండీ) చేశాయి. దాదాపు రూ. 1.79 లక్షల కోట్ల విలువ చేసే జియో సంస్థ అత్యధికంగా రూ. 10,000 కోట్లు బయానాగా చెల్లించింది. ఇక రూ. 71,703 కోట్ల విలువ గల భారతి ఎయిర్‌టెల్‌ రూ. 3,000 కోట్లు, రూ. 43,474 కోట్ల నెగటివ్‌ విలువ గల వొడాఫోన్‌ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ చెల్లించాయి. జియో చెల్లించిన బయానా బట్టి చూస్తే .. సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గణనీయంగా స్పెక్ట్రం తీసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఖజానాకు రూ. 13,000 కోట్లు
స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.12,000–13,000 కోట్లు రావచ్చని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే స్థాయిలో అందవచ్చు. ప్రస్తుత వేలంలో .. ఏడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లలో (700 మెగాహెట్జ్, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్‌) మొత్తం 2,308.80 మెగాహెట్జ్‌ (ఎంహెచ్‌జెడ్‌) స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఇందులో 5జీ కోసం ఉద్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్‌ బ్యాండ్లను చేర్చలేదని, వీటిని తర్వాత వేలం వేయవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు