హైదరాబాదీలకు షాక్..భారీగా పెరిగిన ఇళ్ల ధరలు! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఇంటి ధరలు 8 శాతం అప్‌

Published Wed, Aug 17 2022 4:20 AM

Top 8 Indian Cities Where Real Estate Prices Keep Rising - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో నివాస గృహాల ధర ఏప్రిల్‌–జూన్‌ మధ్య చదరపు అడుగుకు సగటున రూ.9,218గా ఉంది. గత ఏడాది కాలంతో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. మొత్తం ఎనిమిది నగరాల్లో ఈ కాలంలో సగటు ధర పెరుగుదల రేటు 5 శాతంగా ఉంది. హౌసింగ్‌ డిమాండ్‌ పునరుద్ధరణ, నిర్మాణ వ్యయాల్లో పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణమని హౌసింగ్‌ ప్రైస్‌ ట్రాకర్‌ నివేదిక– 2022  తెలిపింది.

రియల్టర్ల అత్యున్నత సంస్థ క్రెడాయ్, రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా, డేటా అనలిటిక్‌ సంస్థ లియాసెస్‌ ఫోరాస్‌లు సంయుక్తంగా రూపొందించిన ఈ నివేదికలో హైదరాబాద్‌సహా ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం (ఎంఎంఆర్‌), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పూణె, అహ్మదాబాద్‌ల రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది.  

నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..
► కార్పెట్‌ ఏరియా (గోడలు కాకుండా ఇంటి లోపలి స్థలం) ఆధారంగా ధరలను లెక్కించడం జరిగింది.  

► 2022 ఏప్రిల్‌–జూన్‌ సమయంలో భారతదేశంలో గృహాల ధరలు మహమ్మారికి ముందు స్థాయిలను అధిగమించాయి. భారీ డిమాండ్, దీనికి తగిన సరఫరాలను ఇది సూచిస్తోంది.  

► భవిష్యత్తులో ధరలు భారీ ఒడిదుడుకులు లేకుండా ఒక నిర్దిష్ట శ్రేణిలో ఉండే అవకాశం ఉంది.  

► పెరుగుతున్న వడ్డీరేట్ల ప్రభావాన్ని డెవలపర్లు ముందే గ్రహించి, తగ్గింపు ఈఎంఐ పథకాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. పండుగ ఆఫర్లు, సరఫరా పరిస్థితి బాగుండడం వంటి అంశాల నేపథ్యంలో విక్రయాల పరిమాణం మెరుగుపడే అవకాశం ఉంది.

► గృహాల ధరల పెరుగుదలకు కీలకమైన నిర్మాణ సామగ్రి రేట్లు, కార్మికుల వేతనాల వంటివి ప్రధాన కారణాలు.  

► గృహ రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం డిమాండ్‌పై స్వల్పంగానే ఉండవచ్చు. సెప్టెంబర్‌ నుంచి విక్రయాలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.

► రాబోయే పండుగ సీజన్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ను సానుకూలంగా ఉంచే అవకాశం ఉంది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్న అభిప్రాయం నెలకొంది.  

► ఢిల్లీ–ఎన్‌సీఆర్‌కు సంబంధించి చూస్తే,  గురుగ్రామ్‌లోని గోల్ఫ్‌కోర్సు రోడ్డులో ఇండ్ల ధర అత్యధికంగా 21 శాతం ఎగసింది.  

► అహ్మదాబాద్‌లో గృహాల ధరలు 3 సంవత్సరాలలో అత్యధికం. గాంధీనగర్‌ సబర్బ్‌లో అత్యధికంగా 13 శాతం పెరుగుదల కనిపించింది.  

► సెంట్రల్‌ చెన్నైలో ధరలు దాదాపు 13 శాతం క్షీణించగా,  పశ్చిమ పూనమల్లిలో అత్యధికంగా 13 శాతం పెరిగింది.

► కోల్‌కతా నైరుతి, హౌరాలో అత్యధికంగా 13 శాతం ధరలు పెరిగాయి.  

► ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం (ఎంఎంఆర్‌) మార్కెట్‌లో పశ్చిమ శివారు ప్రాంతాల్లో (దహిసర్‌కు ఆవల) 12 శాతం చొప్పున  ధరలు పెరిగాయి.

► పూణె మార్కెట్‌లోని కోత్రుడ్, బ్యానర్‌ గృహాల ధరలు గరిష్టంగా 9–10 శాతం శ్రేణిలో పెరిగాయి.  


బడా రియల్టర్ల హవా...
గత దశాబ్ద కాలంలో ఇళ్ల ధరలు పెద్దగా పెరగలేదు. బిల్డర్లు చాలా తక్కువ మార్జిన్‌లో పనిచేస్తున్నారు. కీలకమైన నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు వినియోగదారులపై భారం మోపడం మినహా వేరే మార్గం లేదు. అయినప్పటికీ ఈ రంగంలో బడా, విశ్వసనీయ బిల్డర్లు ఇతరుల కంటే మెరుగైన డిమాండ్‌ను చూస్తున్నారు.  వారు మార్కెట్లో ప్రీమియంను (అధిక ధరల స్థితిని) నియంత్రించగలుగుతున్నారు. తద్వారా ప్రయోజనమూ పొందుతున్నారు.  
– పంకజ్‌ పాల్, ఏఐపీఎల్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

Advertisement
Advertisement