Toshiba: కుట్రలకు చెక్‌, చైర్మన్‌ తొలగింపు.. ఇక సంస్కరణలేనా?

26 Jun, 2021 13:03 IST|Sakshi

టోక్యో: దిగ్గజ కంపెనీ తొషిబాలో అవినీతి, కుట్రకు ఎట్టకేలకు తిరుగుబాటుతో చెక్‌ పెట్టారు షేర్‌ హోల్డర్లు. తొషిబా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి నుంచి ఒసామూ నగయమా(74)ను అర్థాంతరంగా గద్దె దించేశారు. శుక్రవారం సాయంత్రం ఒసామూ రీ ఎలక్షన్‌ కోసం జరిగిన ఓటింగ్‌.. నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ఆపై ఒసామూను చైర్మన్‌ పదవి నుంచి తొలగిస్తున్నట్లు కావాలనే ఆలస్యంగా ప్రకటించింది బోర్డు.

జపాన్‌ ప్రభుత్వంతో కుమ్మక్కై.. ప్రైవేట్‌ ఇన్వెస్టర్ల ఆసక్తిని దెబ్బతీస్తున్నాడని, అధికారులతో కిందటి ఏడాది బోర్డు నామినీల ఓటింగ్‌పై ప్రభావం చూపెట్టాడనేది ఒసామూ మీద ఉన్న ప్రధాన ఆరోపణలు. ఈ కుంభకోణం బయటపడ్డప్పటికీ ఆయన్నే కొనసాగించాలని పలువురు ఇన్వెస్టర్లు మద్దతు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తొలగింపుపై బోర్డు తొందరపాటు ప్రదర్శించలేదు. అయితే శుక్రవారం సాధారణ సమావేశాల సందర్భంగా ఉన్నపళంగా ఓటింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఒసామూను గద్దె దించుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒసామూ మద్దతుదారులు మాత్రం.. సంక్షోభ సమయంలో ఆయన పనితీరును చూసైనా మరో అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహారిస్తామనే సంకేతాల్ని బయటి ఇన్వెస్టర్లకు తోషిబా పంపినట్లయ్యింది.

ఇక సంస్కరణలేనా?

జపాన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్‌లో ఈ నిర్ణయం ఒక మైలు రాయి అని, ముందు ముందు ఇది విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. కాగా, గతంలో ఒసామూ రాజీనామాను డిమాండ్‌ చేసిన తొషిబా అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌ భాగస్వామి 3డీ కంపెనీ తాజా పరిణామాలను స్వాగతించింది. ఇక చైర్మన్‌ పదవికి ప్రతిపాదించిన పేర్లను పక్కనపెట్టిన బోర్డు.. తాత్కాలిక చైర్మన్‌గా తొషిబా సీఈవో సతోషి సునాకవా కొనసాగనున్నారు. సతోషి ఆధ్వర్యంలో త్వరలో మరిన్ని సంస్కరణలతో కంపెనీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బోర్డు తీర్మానం చేసుకుంది. కాగా, ​ఇంతకు ముందు చైర్మన్‌గా ఉన్న నోబువాకి కురుమటాని కూడా అవినీతి ఆరోపణల విమర్శల నేపథ్యంలో రాజీనామా చేశాడు. జపాన్‌తో పాటు ప్రపంచ దేశాలకు తోషిబా బ్రాండ్‌ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. హోం ఎలక్ట్రికల్స్‌ గూడ్స్‌ నుంచి న్యూక్లియర్‌ పవర్‌ స్టేషన్‌ రంగంలోనూ తోషిబా ఒకప్పుడు రారాజుగా ఉండేది. అయితే మేనేజ్‌మెంట్‌ తప్పిదాలు, సరైన పాలనా-పర్యవేక్షణ లేకపోవడమనే కారణాలు.. మార్కెట్‌ను కోల్పోతూ వస్తోంది.

చదవండి: దెబ్బకు 32 కోట్ల డాలర్ల నష్టం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు