Two of Gupta Brothers Arrested in Dubai South Africa Confirms - Sakshi
Sakshi News home page

అవినీతి తిమింగలాలు: గుప్త బ్రదర్స్‌ ఆటకట్టు

Published Tue, Jun 7 2022 4:49 PM

Two of Gupta brothers arrest in Dubai South Africa confirms - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో రాజకీయ సంక్షోభానికి, భారీ అవినీతికి కేంద్రంగా మారి దుబాయ్‌కి పారిపోయిన  ఇండియన్‌ గుప్తా బ్రదర్స్‌కు ఎట్టకేలకు చెక్‌ పడింది. గుప్తా సోదరులుగా పేరొందిన రాజేశ్‌ గుప్తా, అతుల్‌ గుప్తా, అజయ్‌ గుప్తాలలో ఇద్దరిని సోమవారం దుబాయ్‌ పోలీసులు అరెస్టు చేశారు. తమ దేశంలో భారీ అవినీతికి పాల్పడిన ఇద్దరు సోదరులను యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్‌లో అరెస్ట్ చేసినట్టు దక్షిణాఫ్రికా ప్రకటించింది. వీరిని దక్షిణాఫ్రికాకు రప్పించేందుకు నియమించిన నిపుణుల బృందంతో చర్చిస్తున్నట్టు దక్షిణాఫ్రికా నేషనల్ ప్రాసిక్యూటింగ్ అధికారి వెల్లడించారు. అయితే మూడో సోదరుడు అజయ్‌ గుప్తా అరెస్టు  విషయంపై  స్పష్టత లేదన్నారు.

జాకబ్ జుమా దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను వేల కోట్ల రూపాయలకు ముంచేసినట్టు గుప్తా బద్రర్స్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాదాపు 15 బిలియన్‌ రాండ్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.7,513కోట్లను కొల్లగొట్టారని అభియోగం. దీనిపై విచారణ సాగుతుండగానే కుటుంబాలతో  వీరు సహా దుబాయికి పారిపోయారు. అయితే ఇరుదేశాల మధ్య  ఒప్పందా లేని కారణంగా దీంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించింది. దీంతో గుప్తా సోదరులపై గత ఏడాది జూన్‌లో ఇంటర్‌పోల్‌ రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దాదాపు 15 బిలియన్ ర్యాండ్‌లను దోచుకున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని ఆర్గనైజేషన్ అన్‌డూయింగ్ ట్యాక్స్ అబ్యూస్ సీఈఓ వేన్ డువెన్‌హేజ్ తెలిపారు.

 భారీ స్కాంలు,  ఏకంగా ఆర్థికమంత్రి  కావాలని ప్లాన్‌
మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాతో ఉన్న సాన్నిహిత్య సంబంధాలను దుర్వినియోగం చేసి ఆర్థికంగా లాభపడ్డారు.  జుమా తొమ్మిదేళ్ల పదవీకాలంలో నేషనల్‌ ఎలక్ట్రిసిటీ సప్లయర్‌ ‘ఎస్కాం’ లాంటి పలు ప్రభుత్వరంగ సంస్థలను కొల్లగొట్టిన గుప్తా సోదరులు అక్కడి ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. అంతేకాదు, జుమా కేబినెట్‌ మంత్రుల దగ్గర్నుంచి అనేక ప్రభుత్వ నియామకాలను వీరు ప్రభావితం చేశారని ఆరోపణలు వచ్చాయి. 2016లో ఆర్థిక మంత్రి కావడానికి 44 మిలియన్ల డాలర్ల లంచం ఆఫర్‌ చేశారని ఒక అధికారి చెప్పడంతో  వీరి అవినీతి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కారణంగానే 2018లో భారీగా ప్రజా నిరసనలు రాజుకున్నాయి. చివరికి జుమా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన గుప్తా సోదరులు దేశం విడిచి దుబాయికి  పారిపోయారు.


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమా (పైల్‌ ఫోటో)

ఈ పరిణామాన్ని దక్షిణాఫ్రికా ప్రతిపక్షం స్వాగతించింది. దేశాన్ని దోచుకుని, ప్రజల కష్టాలకు కారణమైన వారి అరెస్ట్‌లపై సంతృప్తిని వ్యక్తం చేసింది.  విచారణ త్వరగా ముగించాలని అని ప్రతిపక్ష డెమొక్రాటిక్ అలయెన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ కేసుకు త్వరగా పరిష్కారం లభిస్తుందని ఆశించకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అప్పగింతకోసం దక్షిణాఫ్రికా పడిన పాట్లను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. అంతకు ముందు, రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం లేనందున యుఏఈతో చర్చల వైఫల్యం నేపథ్యంలో  వారిని దక్షిణాఫ్రికాకు అప్పగించేలా యూఎన్‌కి విజ్ఞప్తి చేసింది. దీని ప్రకారం జూన్ 2021లో ఈ ఒప్పందాన్ని ఆమోదించాయి.

కాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు చెందిన అజయ్, అతుల్, రాజేశ్‌ గుప్తా 90వ దశకంలో దక్షిణాఫ్రికాకు వెళ్లి  చెప్పుల వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంలో స్థిరపడిన అనంతరం ఐటీ, మీడియా, మైనింగ్‌ తదితర రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించడమేకాదు చాలా తక్కువ కాలంలోనే దక్షిణాఫ్రికాలో కుబేరులుగా అవతరించారు. వీరి ఆస్తుల్లో  చాలావరకు ఇప్పుడు విక్రయించడమో, లేదా మూసివేయడమో జరిగింది.

Advertisement
Advertisement