ఇది నిరుద్యోగ భారతం.. ఇంకా తగ్గని కరోనా ఎఫెక్ట్!

30 Nov, 2021 21:23 IST|Sakshi

దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు మరోసారి ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. ఈ ఏడాది 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ‘నిరుద్యోగ రేటు’ 9.3 శాతానికి పెరిగింది. గత ఏడాది 2020లో ఇదే త్రైమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1 శాతమే. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిన లెక్కలు.

15 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు అక్టోబర్-డిసెంబర్ 2020 లో 10.3 శాతంగా ఉందని 9వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తెలిపింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో నిరుద్యోగ రేటు(వయస్సు <15) ఏడాది క్రితం 10.6 శాతం నుంచి జనవరి-మార్చి 2021లో 11.8 శాతానికి పెరిగింది. ఇది అక్టోబర్-డిసెంబర్ 2020లో 13.1 శాతంగా ఉంది. పురుషుల్లో, పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ రేటు(వయస్సు <15) ఒక సంవత్సరం క్రితంతో పోలిస్తే జనవరి-మార్చి 2021లో 8.6 శాతంగా ఉంది. ఇది అక్టోబర్-డిసెంబర్ 2020లో 9.5 శాతంగా ఉంది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు పట్టణ ప్రాంతాల్లో సీడబ్ల్యుఎస్ (ప్రస్తుత వారపు స్థితి)లో లేబర్ ఫోర్స్ పాల్గొనే రేటు 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో 47.5 శాతం, ఏడాది క్రితం ఇదే కాలంలో 48.1 శాతంగా ఉంది. 

(చదవండి: కల్లుచెదిరే వజ్రాల గొడుగు.. 12 వేల డైమండ్లు.. ధరెంతో తెలుసా?)

ఎన్‌ఎస్‌ఓ 2017లో పీఎల్‌ఎఫ్‌ఎస్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి త్రైమాసికానికీ మన దేశంలో ఇలా ‘శ్రామిక శక్తి సర్వే’ జరుగుతోంది. దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు(యూఆర్‌)' ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మ స్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్‌’ సూచిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ‘నిరుద్యోగ రేటు’ తక్కువగా ఉందంటే జనం చేతుల్లో డబ్బులు ఎక్కువున్నట్టు లెక్క. తద్వారా వస్తువుల గిరాకీ పెరుగుతుంది. అది ఆర్థికవృద్ధికి తోడ్పడుతుంది. కానీ, ద్రవ్యోల్బణం, మరింత ఉద్యోగ కల్పనను బట్టి ఉండే ఆర్థిక వృద్ధిని కరోనా బాగా దెబ్బతీసింది.

మరిన్ని వార్తలు