ట్రూజెట్‌కు కొత్త భాగస్వామి

2 Apr, 2021 06:18 IST|Sakshi

ఇంటరప్స్‌కు 49 శాతం వాటా

త్వరలోనే డీల్‌ విలువ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విమానయాన సంస్థ ట్రూజెట్‌ ప్రయాణంలో మరో మైలురాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) రూపంలో కంపెనీలోకి భారీ నిధులు వచ్చిచేరనున్నాయి. ట్రూజెట్‌ పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌లో 49 శాతం వాటా కొనుగోలుకు యూఎస్‌కు చెందిన ఇంటరప్స్‌ ముందుకొచ్చింది. అయితే వాటా కింద ఎంత మొత్తం పెట్టుబడి చేస్తున్నదీ ఇరు కంపెనీలూ వెల్లడించలేదు. త్వరలోనే ఈ డీల్‌ పూర్తి కానుంది. టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ను ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) ప్రమోట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కార్యకలాపాల విస్తరణకు, పౌర విమానయాన రంగంలో కొత్త అవకాశాల అన్వేషణకు ఈ నిధులను వెచ్చిస్తామని ఎంఈఐఎల్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ కె.వి.ప్రదీప్, ఇంటరప్స్‌ చైర్మన్‌ పాలెపు లక్ష్మీ ప్రసాద్‌ సంయుక్తంగా తెలిపారు.

దేశవ్యాప్తంగా 21 కేంద్రాలు..
హైదరాబాద్‌ కేంద్రంగా ట్రూజెట్‌ 2015 జూలైలో కార్యకలాపాలను ప్రారంభించింది. ఉడాన్‌ పథకం ఆసరాగా మెట్రోలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలను అనుసంధానిస్తూ విమానయాన సేవలను అందుబాటులోకి తెచ్చింది. వీటిలో హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరుతోపాటు విజయవాడ, రాజమండ్రి, కడప, తిరుపతితోసహా 21 కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 28.2 లక్షల మంది ట్రూజెట్‌లో ప్రయాణించారు. సంస్థ ఖాతాలో ఏడు విమానాలు వచ్చి చేరాయి. ఏటీఆర్‌–72 రకం ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను కంపెనీ వినియోగిస్తోంది. హైదరాబాద్‌–ఔరంగాబాద్‌ సెక్టార్‌లో ట్రూజెట్‌ మాత్రమే సర్వీసులను నడుపుతోంది. కాగా, లక్ష్మీ ప్రసాద్‌ గతంలో హైదరాబాద్‌లో చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా సేవలందించారు. 1997లో యూఎస్‌లో అడుగుపెట్టారు. గతేడాది ఎయిర్‌ ఇండియా ఉద్యోగులతో కలిసి ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు.

మరిన్ని వార్తలు