గూగుల్‌ దెబ్బ.. ఆ బ్రౌజర్‌కు ఘోరంగా తగ్గిన యూజర్లు | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌ సెట్‌ బ్రౌజర్‌కు దెబ్బ, కోట్లలో యూజర్లను కోల్పోయిన ఫైర్‌ఫాక్స్‌

Published Sat, Aug 7 2021 11:59 AM

Web Browser Firefox Has Lost 46m Users Over The Last Three Years - Sakshi

వెబ్‌ బ్రౌజర్‌గా ఒకప్పుడు ఊపుఊపిన మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌.. కాలక్రమంలో తన యూజర్లను కోల్పోతోంది. గడిచిన 3 ఏళ‍్ల కాలంలో 46 మిలియన్ల మంది యూజర్లు.. మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌కు దూరం అయినట్లు రెడ్డిట్‌లో ఓ పబ్లిక్‌ డేటా రిపోర్ట్‌ ఒకటి వెల్లడించింది. 

2002లో విడుదలైన మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌.. వెబ్‌ బ్రౌజర్‌ యూజర్లను ఆకట్టుకోవడంతో అనతి కాలంలో విశేష ఆధారణ లభించింది. ముఖ్యంగా థర్డ్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేసిన ఒక్కరోజులోనే సుమారు 8 మిలియన్లు పైగా యూజర్లు డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. కానీ, అప్రతిహితంగా కొనసాగుతూ వచ్చిన ఫైర్‌ఫాక్స్‌ ఉనికికి..  గూగుల్‌ 2008లో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ తీసుకొచ్చి బ్రేకులు వేసింది. 

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గూగుల్‌ బ్రౌజర్‌ ఇన్‌ బిల్ట్‌గా రావడం,  ఎక్కువ సంఖ్యలో వెబ్‌సైట్లు గూగుల్‌ క్రోమ్‌కు అప్టిమైజ్‌ కావడం, అదే టైంలో ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ నెమ్మదించడం లాంటి కారణాలతో క్రోమ్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. పబ్లిక్‌ డేటా రిపోర్ట్‌ ప్రకారం..  2018లో మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్‌ యూజర్లు 244 మిలియన్ల మంది..  2021 నాటికి ఆ సంఖ్య 198 మిలియన్‌ యూజర్లకు పడిపోయింది. అయితే మరో బ్రౌజర్‌ ఏదీ గూగుల్‌ క్రోమ్‌కి ప్రత్యామ్నాయంగా లేకపోవడంతో రెండో స్థానంలో మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌ కొనసాగుతోందని టెక్‌ గురూస్‌ అంచనా వేస్తున్నారు. 

ఇక ఒకప్పుడు పాపులర్‌ బ్రౌజర్‌గా ఉన్న మోజిల్లా ఫైర్‌ఫాక్స్‌కు ఆదరణ తగ్గడానికి కారణం దాని పనితీరేనని అంచనా వేస్తున్నారు. మోజిల్లా అప్‌ డేట్ల గురించి ఫిర్యాదులతో పాటు యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ వెర్షన్‌ (యూఐ) ఫైర్‌ఫాక్స్ 89 కూడా ఆకట్టుకోలేక పోయింది.
 

Advertisement
Advertisement