Whatsapp Privacy Policy Update 2021: Whatsapp Postpones Privacy Whatsapp Postpones Privacy Policy Update - Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ అప్‌డేట్‌‌.. మరో 3 నెలలు వాయిదా

Published Sat, Jan 16 2021 11:42 AM

Whatsapp Postpones Its New Privacy Policy Update - Sakshi

ముంబై: నూతన ప్రైవసీ విధానంపై వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. మరో మూడు నెలల పాటు అప్‌డేట్‌ని వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. పది రోజుల క్రితం వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిని అంగీకరించకపోతే యూజర్‌ మొబైల్‌ ఫోన్లలో 2021, ఫిబ్రవరి 8 నుంచి వాట్సాప్‌ పని చేయదని ప్రకటించింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం వాట్సాప్..‌ యూజర్‌ వ్యక్తిగత‌ సమాచారం, డివైజ్‌ ఇన్ఫర్మేషన్‌, ఐపీ అడ్రస్‌ తదితర వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఇక వ్యక్తిగత గోపత్యకు భంగం కలగనుందనే ఉద్దేశంతో చాలా మంది యూజర్లు వాట్సాప్‌ను డిలీట్‌ చేసి.. టెలిగ్రాం, సిగ్నల్‌ యాప్స్‌కి మారారు.

ఈ పరిస్థితులతో వాట్పాప్‌ మేలుకొన్నది. తన అప్‌డేట్‌ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాట్సాప్‌ తన బ్లాగ్‌లో ‘‘మీరు.. మీ కుటంబ సభ్యులు, స్నేహితులతో పంచుకునే సమాచారం ఏదైనా మీ మధ్యే ఉంటుందనే ఐడియా మీద వాట్సాప్‌ని అభివృద్ధి చేశాం. మీ వ్యక్తిగత సంభాషణని ఎండ్‌-టూ-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ పద్దతిలో మేం రక్షిస్తాం. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మీ సందేశాలను చదవదు.. మీరు పంపే లోకేషన్‌లని చూడదు.. మీరు ఎవరికి కాల్‌ చేశారు.. ఎవరితో మెసేజ్‌ చేస్తున్నారనే విషయాలను కూడా మేం గమనించం. మీ కాంటాక్ట్స్‌ని ఫేస్‌బుక్‌తో పంచుకోం’’ అని తెలిపింది. (చదవండి: వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..? )

ఇక ‘‘ఈ నూతన అప్‌డేట్‌ వల్ల ఏదీ మారడం లేదు. బిజినెస్‌ ఫీచర్స్‌ని మరింత మెరుగ్గా అందించడం కోసం మాత్రమే ఈ అప్‌డేట్‌ని తీసుకొచ్చాం. మేము డేటాను ఎలా సేకరిస్తాము, ఉపయోగిస్తాము అనే దానిపై ఇది మరింత పారదర్శకతను అందిస్తుంది. ఈ రోజు ప్రతి ఒక్కరూ వాట్సాప్‌ బిజినెస్‌తో షాపింగ్ చేయకపోయినా, భవిష్యత్తులో ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని ఎంచుకుంటారని మేము భావిస్తున్నాము. ఈ సేవల గురించి ముఖ్యమైన వ్యక్తులకు తెలుసు. ఈ అప్‌డేట్‌ ఫేస్‌బుక్‌తో డాటాను పంచుకునే మా సామర్థ్యాన్ని పెంచదు’’ అని స్పష్టం చేసింది.

ఇక ‘‘యూజర్లు కొత్త అప్‌డేట్‌ను అంగీకరించే తేదీని మేం వెనక్కి తీసుకుంటున్నాం. ఫిబ్రవరి 8 న ఎవరి అకౌంట్‌లను నిలిపివేయం.. తొలగించం. అలానే వాట్సాప్‌లో గోప్యత, భద్రత ఎలా పనిచేస్తుందనే దానిపై ఉన్న తప్పుడు సమాచారాన్ని తొలగించడానికి మేము ఇంకా చాలా చేయబోతున్నాం. మే 15న కొత్త బిజినెస్‌ ఫీచర్‌ అందుబాటులోకి రాకముందే మేము పాలసీని సమీక్షించడానికి క్రమంగా ప్రజల వద్దకు వెళ్తాము’’ అన్నది. (చదవండి: వాట్సాప్ కి పోటీగా 'సిగ్నల్' యాప్)

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తీసుకురావడానికి వాట్సాప్ సహాయపడింది. ఈ భద్రతా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు, భవిష్యత్తులో రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నాము. గందరగోళ నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పుకార్లను ఆపడానికి, వాస్తవాలను ప్రచారం చేయడానికి  సహాయం చేసిన వారందరికి ధన్యవాదాలు. వ్యక్తిగత సంభాషణ చేయడానికి వాట్సాప్‌ను ఉత్తమమైన మార్గంగా నిలపడానికి మేం నిరంతరం కృషి చేస్తాం’’ అని తెలిపింది. 

Advertisement
Advertisement