విప్రో లాభం ఫ్లాట్‌ | Sakshi
Sakshi News home page

విప్రో లాభం ఫ్లాట్‌

Published Fri, Apr 28 2023 4:31 AM

Wipro Q4 Results: Profit slips to Rs 3074 crore - Sakshi

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం (2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జనవరి–మార్చి (క్యూ4)లో నికర లాభం నామమాత్ర వెనకడుగుతో రూ. 3,075 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది (2021–22) ఇదే కాలంలో రూ. 3,087 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం మాత్రం 11 శాతం వృద్ధితో రూ. 23,190 కోట్లను అధిగమించింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి సైతం విప్రో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 11,350 కోట్లకు పరిమితమైంది. అయితే మొత్తం ఆదాయం 14 శాతం పైగా ఎగసి రూ. 90,488 కోట్లను తాకింది. క్యూ4లో 1,823 మంది ఉద్యోగులు తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,56,921కు పరిమితమైంది.

అంచనాలు వీక్‌..:  2023–24 తొలి త్రైమాసికం(ఏప్రిల్‌–జూన్‌)లో ఐఎస్‌ఆర్‌ఈ సహా.. ఐటీ సర్వీసుల బిజినెస్‌ నుంచి ఆదాయం త్రైమాసికవారీగా 3–1% మధ్య క్షీణించవచ్చని విప్రో తాజాగా అంచనా వేసింది. వెరసి 275.3–281.1 కోట్ల డాలర్ల మధ్య ఆదాయం సాధించవచ్చని గైడెన్స్‌ ప్రకటించింది. బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌లో  మందగమన పరిస్థితులున్నా, డీల్‌ పైప్‌లైన్‌ పటిష్టంగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు.

షేర్ల బైబ్యాక్‌కు సై: సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 445 ధర మించకుండా 26,96,62,921 షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది. ఇవి కంపెనీ ఈక్విటీలో 4.91 శాతం వాటాకు సమానంకాగా..ఇందుకు రూ. 12,000 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు వెల్లడించింది.  

ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో యథాతథంగా రూ. 375 వద్ద ముగిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement