ఉపాధి కోసం క్యూ కడుతున్న మహిళలు

22 Jan, 2024 06:09 IST|Sakshi

కోటి మంది దరఖాస్తులు

ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే అధికం

ఆప్నా ప్లాట్‌ఫామ్‌ నివేదిక విడుదల

ముంబై: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మరింత మంది మహిళలు ఉపాధి కోసం ముందుకు వస్తున్నారు. 2023లో 13 శాతం అధికంగా సుమారు కోటి మంది మహిళలు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు జాబ్స్, ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ ప్లాట్‌ఫామ్‌ ఆప్నా డాట్‌ కో నివేదిక వెల్లడించింది. 2022లో ఇవే పట్టణాల నుంచి మొత్తం 2.7 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు రాగా, అందులో మహిళలకు సంబంధించినవి 87 లక్షలుగా ఉన్నాయి.

మహిళలు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వచి్చన ఉద్యోగ దరఖాస్తులు 3.2 కోట్లుగా ఉన్నాయి. ప్రతి నిమిషానికి మహిళల నుంచి 100 ఉద్యోగ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో 80 శాతానికి పైగా కార్యాలయ విధులకు సంబంధించినవే ఉన్నాయి. ఇంటి నుంచి పనిచేయడానికి బదులు, కార్యాలయం నుంచి పని చేయడం, కెరీర్‌ వృద్ధి కోసం మహిళలు చూస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆప్నా నివేదిక తెలిపింది.

2022, 2023 సంవత్సరాల్లో తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్‌ పోస్టింగ్‌లు, దరఖాస్తుల ఆధారంగా ఆప్నా ఈ వివరాలను విడుదల చేసింది. సేల్స్‌ సపోర్ట్, ఎంటర్‌ప్రైజ్‌ సేల్స్, అడ్వరై్టజింగ్, రియల్‌ ఎస్టేట్, ఇన్‌సైడ్‌సేల్స్, బ్రాండ్‌ మార్కెటింగ్, ఈ కామర్స్‌ తదితర విభాగాల్లో నిర్వహణ విధులకు సంబంధించి పోస్టింగ్‌లు పది రెట్లు పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 60 శాతం జాబ్‌ పోస్టింగ్‌లు ఫ్రెషర్లకు సంబంధించినవే ఉన్నట్టు ఆప్నా నివేదిక తెలిపింది.   

>
మరిన్ని వార్తలు