Zomato CEO Announces Restrooms For Delivery Partners, Know Details Inside - Sakshi
Sakshi News home page

Zomato Restrooms: జొమాటో సూపర్‌ న్యూస్‌.. వారికి ఇక ఇబ్బందులు తప్పినట్టే!

Published Fri, Feb 17 2023 11:35 AM

Zomato Announces Restrooms For Delivery Partners - Sakshi

ఉరుకులు, పరుగులు పెడుతూ విశ్రాంతి లేకుండా సేవలందిస్తున్న ఫుడ్‌ డెలివరీ ఏజెంట్స్‌కు జొమాటో సూపర్‌ న్యూస్‌ చెప్పింది. ఆర్డర్స్‌ స్వీకరించడం, డెలివరీ చేయడం..  ఇలా బిజీ షెడ్యూల్‌తో ఫుడ్‌ డెలివరీ ఏజెంట్స్‌ పనిచేస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుందామన్న సమయం దొరకదు. సమయం దొరికినా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలో తెలియని పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెడుతూ ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో డెలివరీ ఏజెంట్ల కోసం ‘రెస్ట్‌ పాయింట్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

కేవలం జొమాటో ఏజెంట్స్‌ మాత్రమే కాకుండా ఇతర సంస్థలకు చెందిన డెలివరీ ఏజెంట్లు కూడా ఈ రెస్ట్‌ పాయింట్లను వినియోగించుకోవచ్చని జొమాటో సీఈఓ దీపిందర్‌ గోయల్‌ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. గురుగ్రామ్‌లో ఇప్పటికే రెండు రెస్ట్‌ పాయింట్లు ఏర్పాటు చేశామని, త్వరలోనే మరికొన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రెస్ట్‌ పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ రెస్ట్‌ పాయింట్స్‌లో తాగునీరు, ఫోన్ ఛార్జింగ్, హై-స్పీడ్ ఇంటర్నెట్, వాష్‌రూమ్‌లు, 24×7 హెల్ప్‌డెస్క్, ఫస్ట్‌ ఎయిడ్‌ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం విధులు నిర్వర్తిస్తున్న డెలివరీ ఏజెంట్స్‌ సంక్షేమంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. ఈ రెస్ట్‌ పాయింట్స్‌ ఏర్పాటుతో ఏజెంట్లు అలసట నుంచి విముక్తి పొంది శారీరకంగా, మానసికంగా ఉపశమనం పొందుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: Neal Mohan యూట్యూబ్‌ కొత్త సీఈవో: మరోసారి ఇండియన్స్‌ సత్తా)

Advertisement
Advertisement