జొమాటోలో ‘ప్యూర్‌ వెజ్‌’ చిచ్చు! | Deepinder Goyal Top Team Zoom Call For Over 20 Hours After Pure Veg Controversy, See Details Inside - Sakshi
Sakshi News home page

Zomato Pure Veg Controversy: జొమాటోలో ‘ప్యూర్‌ వెజ్‌’ చిచ్చు.. చివరికి వెనక్కి తగ్గిన డెలివరీ సంస్థ

Published Sun, Mar 24 2024 8:53 AM

Deepinder Goyal Top Team Zoom Call For Over 20 Hours After Pure Veg Raw - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల అందుబాటులోకి తెచ్చిన  ‘ప్యూర్‌ వెజ్‌’ ఫుడ్‌ డెలివరీ సర్వీసులు ఆ సంస్థలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమస్య నుంచి బయట పడేందుకు సంస్థ టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లతో సుమారు ఏకదాటిగా 20 గంటల పాటు జూమ్‌ కాల్స్‌ నిర్వహించినట్లు జొమాటో కోఫౌండర్‌, సీఈవో దీపిందర్‌ గోయల్‌ తెలిపారు. 

జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డ్‌’ ల కార్యక్రమం నిర్వహించింది. అయితే ఎంట్రప్రెన్యూర్‌ విభాగంలో దీపిందర్‌ ఎంట్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది అవార్డ్‌ను సొంతం చేసుకున్నారు. ఈ అవార్డ్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ చేతులు మీదిగా అందుకున్నారు.    

పెద్ద ఎత్తున ట్రోలింగ్‌
ఈ సందర్భంగా ప్యూర్‌ వెజ్‌ వివాదంపై జొమాటో సీఈవో మాట్లాడారు. కస్టమర్లు, ఆయా రెస్టారెంట్‌ల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా మేం ప్యూర్‌ వెజ్‌ మోడ్‌, ప్యూర్‌ వెజ్‌ ఫ్లీట్‌ సేవల్ని అందుబాటులోకి తెచ్చాం. కానీ ఈ సర్వీసులపై ఊహించని విధంగా వివాదం తలెత్తింది. నెటిజన్లు సైతం సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ చేశారని అన్నారు.  

తలెత్తిన ఆందోళనలు 
‘‘ప్యూర్‌ వెజ్‌ వివాదంపై నెటిజన్లు సైతం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWAs) వెజ్‌ - నాన్‌ వెజ్‌ కలిపి తెస్తే ఆర్డర్‌లను తిరస్కరించే అవకాశం ఉందనే అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. డెలివరీ సిబ్బందిని సైతం అడ్డుకునే ప్రమాదం ఉందని వాపోయారు. ఇప్పటికే  వెల్ఫేర్‌ అసోసియేషన్లలో విధించే ఆంక్షల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు గురించి ప్రస్తావించారు. అదే సమయంలో డెలివరీ సిబ్బంది సైతం ఓన్లీ వెజ్‌ పాలసీ వల్ల అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళనల్ని వ్యక్తం చేశారు.’’ 

ప్యూర్‌ వెజ్‌పై వెనక్కి తగ్గిన జొమాటో  
అయితే దీన్ని పరిష్కరించేందుకు జొమాటో ఉన్నత స్థాయి ఉద్యోగులతో సుమారు 20 గంటల పాటు జూమ్‌ కాల్‌ నిర్వహించామని గుర్తు చేశారు. ఆ తర్వాత వినియోగదారుల నుంచి వ్యతిరేకత రావడం, ప్యూర్‌ వెజ్‌పై దుమారం చెలరేగడంతో ఆయా ప్రభుత్వాలు జొమాటోకి నోటీసులు అందించాయి. ఫలితంగా పలు రాష్ట్రాల్లో ఆ సర్వీసుల్ని నిలిపివేస్తున్నట్లు జొమాటో అధికారికంగా ఎక్స్‌.కామ్‌లో ట్వీట్‌ చేశారు. 

ఇక ఎన్డీటీవీ అవార్డ్‌ల కార్యక్రమంలో ‘దయచేసి ఈ ప్యూర్ వెజ్  స‌ర్వీస్ ఏ మ‌తానికి, రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ల‌కు వ్య‌తిరేకం కాద‌ని జొమాటో అధినేత, సీఈవో దీపిందర్‌ గోయల్‌ మరోసారి పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ప్యూర్‌ వెజ్‌ సేవల్ని అందిస్తారా? లేదంటే నిలిపివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement