విశేష‘శోభ’! | Sakshi
Sakshi News home page

విశేష‘శోభ’!

Published Wed, Mar 22 2023 1:20 AM

- - Sakshi

తెలుగు ఉగాది పర్వదినం శ్రీశోభకృత్‌నామ సంవత్సరానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలోని ఆలయాలను యంత్రాంగం చూడముచ్చటగా తీర్చిదిద్దింది. అరటి పిలకలు, మామిడితోరణాలు, వివిధ రకాల పూలు, విద్యుద్దీప కాంతులతో ప్రత్యేక అలంకరణలు చేపట్టింది.

ప్రధానంగా పులుపు, వగరు, తీపి, కారం, ఉప్పు, చేదు కలగలిపి షఢ్రుచులతో తయారుచేసిన ఉగాది పచ్చడిని ఉదయం నుంచి భక్తులకు పంపిణీ చేయనుంది. అలాగే ప్రముఖ అవధానులు, ఆగమసలహాదారుల ఆధ్వర్యంలో పంచాగశ్రవణాన్ని భక్తులకు విశదీకరించనుంది.

సాక్షి, తిరుపతి: తెలుగు నూతన సంవత్సర ఉగాది వేడుకలకు ఆలయాలన్నీ ముస్తాబయ్యాయి. శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. తిరుమల శ్రీవారి ఆలయం, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి, శ్రీనివాస మంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి, నారాయణవనంలో శ్రీపద్మావతి సమేత కళ్యాణ వేంకటేశ్వరస్వామి, నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీకాళహస్తీశ్వరాలయం వంటి ముఖ్యమైన ఆలయాలతో పాటు.. ప్రతి గ్రామంలోని ఆలయాలన్నింటిలోనూ ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. అందుకోసం ఆలయాలన్నింటినీ సర్వాంగ సుందరంగా ఆలంకరించారు. పంచాంగశ్రవణం, ఆస్థానం నిర్వహించి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో వాహనసేవలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించనున్నారు.

మహతిలో ఉగాది ఉత్సవం

టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. ముందుగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, టీటీడీ ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థవారి వేదపారాయణం నిర్వహించనున్నారు. టీటీడీ ఆగమసలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీవేదాంతం విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం చేయనున్నారు. తిరుపతికి చెందిన ప్రముఖ అవధాని శ్రీఆముదాల మురళి అష్టావధానం చేయనున్నారు. అనంతరం టీటీడీ ఉద్యోగుల పిల్లలకు వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి.

ముస్తాబైన శ్రీవారి ఆలయం

శ్రీశోభకృత్‌నామ ఉగాది వేడుకలకు సర్వం సిద్ధం సర్వాంగసుందరంగా ముస్తాబైన ఆలయాలు పంచాంగశ్రవణం, ఆస్థానానికి ఏర్పాట్లు పూర్తి

ఎండు కొబ్బరి చిప్పల్లో దశావతారం

Advertisement
Advertisement