భూసారం.. | Sakshi
Sakshi News home page

భూసారం..

Published Mon, May 1 2023 6:00 AM

- - Sakshi

అన్నదాతకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. సాగుకు పూర్తిగా సహకారం అందిస్తోంది. వ్యవసాయంలో నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెడుతోంది. ఆరుగాలం కష్టించే కర్షకుడిని ఆదాయ మార్గంలో నడిపించేందుకు చర్యలు చేపడుతోంది. రైతుకు అవసరమైన అన్ని సేవలను ఆర్‌బీకేల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ క్రమంలో ఉచితంగా భూసార పరీక్షలను చేయించుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే వెసులుబాటు కల్పిస్తోంది. పొలంలోని పోషకాలను బట్టి ఎరువులు వినియోగించుకునే అవకాశం అందిస్తోంది.
● పకడ్బందీగా మట్టి నమూనాల సేకరణ ● పర్యవేక్షిస్తున్న ఆర్‌బీకేల సిబ్బంది ● వ్యవసాయంలో వినూత్న విధానాల అమలు ● పోషకాలకు తగ్గట్టు ఎరువులు వాడాలంటున్న నిపుణులు ● రైతులకు ఎప్పటికప్పుడు సలహాలందిస్తున్న అధికారులు

మట్టి సేకరణ ఇలా..

భూసార పరీక్షలు చేయించుకునేందుకు రైతులు తమ పొలంలో మట్టిని సేకరించి సమీపంలోని ఆర్‌బీకేలో అందజేయాలి. పంట కోత తర్వాత, వేసవిలో సాగు చేయని సమయంలో భూసార పరీక్షలకు అవసరమయ్యే మట్టిని సేకరించాల్సి ఉంటుంది. ముందుగా పొలంలో ‘వి’ ఆకారంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతున పారతో గుంత తీయాలి. అందులో పై పొర నుంచి కింది వరకు ఒకవైపు మట్టిని తీయాలి. ఇలా పొలంలో మొత్తంగా 8 నుంచి 10 చోట్ల మట్టిని సేకరించారు. తర్వాత ఆ మట్టిని బాగా కలపాలి. దాన్ని నాలుగు భాగాలు చేసి, నమూనాకు అవసరమైన మట్టిని వేరుచేసి బాగా ఆరబెట్టాలి. తర్వాత ప్లాస్టిక్‌ బ్యాగ్‌ లేదా పాలిథిన్‌ కవర్లో నింపి రైతు వివరాలు రాయాలి. అనంతరం ఆర్‌బీకేల్లో అందజేస్తే, వారు భూసార పరీక్షా కేంద్రాలకు ఆయా నమూనాలను పంపిస్తారు. ఫలితాలను రైతులకు తెలియజేస్తారు. ఈక్రమంలోనే మట్టి నమూనాలను గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(జీపీఎస్‌)తో అనుసంధానం చేస్తున్నారు.

దిగుబడి పెరిగింది

భూసార పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేయించడం అభినందనీయం. అనవసరంగా ఎరువులు వాడకుండా ఖర్చు తగ్గుతోంది. అదనుకు తగ్గట్టు పోషకాలను అందించడం వల్ల దిగుబడి సైతం పెరిగింది. అలాగే రైతు భరోసా కేంద్రాల సిబ్బంది కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్నారు. సాగుకు కావాల్సిన సలహాలను అందిస్తున్నారు.

– రత్నప్ప, రైతు,

కనమనపల్లె, గుడుపల్లె మండలం

లోపాలను గుర్తించే అవకాశం

మా గ్రామంలో ఎక్కువగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నాం. ప్రభుత్వం చేపట్టిన విధానం ద్వారా అందరూ భూసార పరీక్షలు చేయించుకునే అవకాశం వచ్చింది. తద్వారా భూమిలో పోషకాల లోపాలను గుర్తించి ఏమేమి వాడాలో తెలుసుకుంటున్నాం. దీంతో చక్కటి దిగుబడి పొందే వెసులుబాటు వచ్చింది. – టి.నీరజాక్షులు, రైతు,

టి పుత్తూరు, తవణంపల్లె

సమగ్ర సమాచారంతో కార్డులు

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు చేయిస్తున్నాం. సదరు రైతులకు వారి పొలాల్లోని పోషకాలు ఇతర సమగ్ర వివరాలతో కూడిన కార్డులను అందజేస్తున్నాం. వాటి ఆధారంగా పంటలను సాగు చేసుకుని అధిక ఆదాయం పొందే వెసులుబాటు కల్పిస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు భూసార పరీక్షలపై క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

– మురళీకృష్ణ,

జిల్లా వ్యవసాయశాఖాధికారి, చిత్తూరు

సాక్షి, చిత్తూరు : భూమిలో సహజ సిద్ధంగానే పోషక విలువలుంటాయి. కానీ, రసాయన ఎరువులను అధికంగా వినియోగించడం వల్ల అవి క్రమేణా నశించిపోతున్నాయి. దీంతో రైతులు ఆశించిన మేర దిగుబడి సాధించలేక నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అన్నదాతకు అండగా నిలిచేందుకు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. అలాగే భూమిలో పోషకాల స్థాయి, స్థితిగతులను తెలుసుకునేందుకు భూసార పరీక్షలు చేయిస్తోంది.

క్షేత్రస్థాయిలో అవగాహన

భూసార పరీక్షల ద్వారా చేకూరే లబ్ధిని వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి రైతు తన పొలంలో పోషకాల విలువ స్థాయిని తెలుసుకునేలా చర్యలు చేపడుతున్నారు.

ప్రతి మూడేళ్లకూ పరీక్ష అవసరం

భూసార పరీక్షలను ప్రతి మూడేళ్లకు ఒకసారి చేయించుంటే మంచిదని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో భూసార స్థితిని భౌతిక రసానిక పద్ధతులలో విశ్లేషించి పోషక విలువలు, నేల స్వభావాన్ని కచ్చితంగా తెలుసుకునే అవకాశముంటుందని వెల్లడిస్తున్నారు. ఫలితాల ఆధారంగా ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలో అవగాహన వస్తుందని వివరిస్తున్నారు. లోపించిన పోషకాలను సకాలంలో అందించడం వల్ల భూమి సారవంతంగా మారి మంచి దిగుబడి పొందవచ్చని తెలియజేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చాం

రైతులు భూసార పరీక్షలు చేయించుకునేందుకు సాయం చేయాలని ఆర్‌బీకే సిబ్బందిని ఆదేశించాం. దీనిపై వారికి క్షేత్రస్థాయిలో పూర్తి శిక్షణ ఇచ్చాం. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయి. ఈ సమయంలో భూసార పరీక్షలకు మట్టి నమూనాలు సేకరిస్తే మంచిది. రాబోయే సీజన్‌లో అదనుకు తగ్గట్టు పంట వేసుకోవచ్చు. అవసరాల మేర పోషకాలను అందించే ఎరువులు వాడుకోవచ్చు.

– శివకుమార్‌, ఏడీఏ, పుంగనూరు

సంపూర్ణ సహకారం

జిల్లావ్యాప్తంగా భూసార పరీక్షలు చేయిస్తున్నాం. మొత్తం 502 రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ఇప్పటికే మట్టి నమూనాల సేకరణపై పనిచేస్తున్నారు. వ్యవసాయశాఖ ద్వారా రైతులకు సంపూర్ణంగా సహకరిస్తున్నాం. అన్నదాతలు చక్కటి దిగుబడి సాధించేందుకు అవసరమైన సలహాలను అందజేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగును సంబరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం.

– సగిలి షణ్మోహన్‌, కలెక్టర్‌, చిత్తూరు

రైతులకు అవగాహన

పొలాలకు భూసార పరీక్షలు తప్పనిసరి. ఏ పంట వేయాలన్నా భూమిలో పోషకాలు ఉంటేనే ఆదాయం పొందగలం . దీనిపై ఇప్పటికే రైతులకు అవగాహన వచ్చింది. రైతు భరోసా కేంద్రాల వద్దకే వారు మట్టి నమూనాలను తీసుకువస్తున్నారు. మరికొందరు అనుమానాలుంటే ఫోన్‌ ద్వారా సంప్రదిస్తున్నారు. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

– జయశ్రీ, ఆర్‌బీకే ఇన్‌చార్జి,

దుర్గసముద్రం, చౌడేపల్లె మండలం

మట్టి సేకరిస్తున్న ఆర్‌బీకే సిబ్బంది (ఫైల్‌)
1/7

మట్టి సేకరిస్తున్న ఆర్‌బీకే సిబ్బంది (ఫైల్‌)

2/7

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement
Advertisement