అనుభవించు రాజా! | Sakshi
Sakshi News home page

అనుభవించు రాజా!

Published Wed, Nov 22 2023 12:36 AM

కాలువ పోరంబోకు భూమిని ఆక్రమించుకుని మామిడి మొక్కలు నాటి ఉన్న దృశ్యం  - Sakshi

సాక్షి, తిరుపతి: చిత్తూరులో టీడీపీ నేతలు ప్రభుత్వ భూములపై కన్నేశారు. కొందరు అధికారుల అండతో విలువైన భూములను నొక్కేస్తున్నారు. ఆక్రమించుకున్న భూముల్లో మొక్కలు నాటి అనుభవం పేరుతో ఒకరు దర్జాగా జెండా పాతేస్తున్నాడు. ఆపై భూములు తన అనుభవంలో ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి విలువైన భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. మరొకరు తన అనుభవంలో ఉన్న భూమి రహదారి కోసం తీసుకున్నారంటూ ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని నొక్కేస్తున్నాడు. ఈ అక్రమ భూదందా బదీలీపై వెళ్లిన ఓ వీఆర్‌ఓ కన్నుసన్నల్లో నడుస్తోంది. చిత్తూరు మండలం, 36 గొల్లపల్లి ప్రాంతంలో రెండేళ్ల క్రితం చిత్తూరు– తచ్చూరు రోడ్డు పురుడు పోసుకుంది. ప్రస్తుతం రోడ్డు పనులు చకచకా సాగుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా పట్టా భూములతో పాటు వందల ఎకరాల మేత బీడు భూమి, కాలువ భూమి, బీడు భూములు ఉన్నాయి. ఇటీవల జరిగిన రీసర్వేలో కూడా ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించినవిగా గుర్తించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో ఈ భూములు కోట్ల రూపాయల ధర పలుకుతున్నాయి. భవిష్యత్‌లో మరింతగా డిమాండ్‌ పెరుతుందని భావించిన టీడీపీ నేతలు ఓ వీఆర్వో సహకారంతో ఇద్దరు రెవెన్యూ అధికారులతో కలిసి ఈ భూములపై కన్నేశారు.

టీడీపీ నేతా.. మజాకా?

గొల్లపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తన తెలివితేటలు ఉపయోగించి ప్రభుత్వ భూములను తన అనుభవంలో ఉన్నట్లు పత్రాలు సృష్టించుకున్నాడు. చిత్తూరు– తచ్చూరు రోడ్డు వేయడంతో తన భూమి పోయిందని పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు ఎకరానికి రూ.1.5 లక్షల చొప్పున వీఆర్వో, మరో ఇద్దరు రెవెన్యూ అధికారులకు మామూళ్లు ఇచ్చుకున్నాడు. బదిలీపై వెళ్లిన ఓ వీఆర్‌ఓ సహకారంతో అంతా పక్కాగా స్కెచ్‌ వేశాడు. రూ.లక్ష చేతిలో పెట్టి రూ.15 లక్షల పరిహారాన్ని కొట్టేసేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. డీల్‌ ప్రకారం మూడెకరాలకు పరిహారం అందినట్లు సమాచారం. అయితే పరిహారం పంపకాల్లో అధికారులు, టీడీపీ నేత మధ్య వివాదం రేగినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆక్రమించి.. ఆపై అనుభవం

మరో టీడీపీ నేత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆ వెంటనే మామిడి మొక్కలు నాటేశాడు. ఆ మొక్కలు చూపించి ఆ భూమి తన అనుభవంలో ఉన్నట్టు ఆ వీఆర్వో సహకారంతో రికార్డులు తయారు చేయించుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తమదేనంటూ కొన్ని పత్రాలు చూపించి బెదిరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అనుభవ పత్రాలు చూపించి వెంటనే అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఆక్రమించుకున్న కాలువ పోరంబోకు భూమి మూడెకరాలు ఇప్పటికే ఇతరులకు విక్రయించారు. మిగిలిన భూమికి అనుభవ పత్రాలు సృష్టించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ సమాచారం.

పక్క సర్వే నంబర్‌ వేసి అమ్మేస్తున్నారు

ఆ వీఆర్వో మరి కొన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించి సొమ్ముచేసుకునేందుకు మరో పథకం వేశాడు. గుట్టుచప్పుడు కాకుండా పక్కనున్న పట్టా భూమి సర్వే నంబర్‌ను వేసి ప్రభుత్వ భూములను ఇతరులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.

చిత్తూరులో టీడీపీ నేతల భూ దందా విలువైన కాలువపోరంబోకు భూమి ఆక్రమణ అడ్డురాకుండా ఉండేందుకు

మొక్కలు నాటిన వైనం

అనుభవం పేరుతో ఎకరం

రూ.లక్ష చొప్పున విక్రయం

బదిలీపై వెళ్లిన వీఆర్‌ఓ కన్నుసన్నల్లో

అక్రమదందా

ఉన్నతాధికారుల కళ్లుగప్పి తమ్ముళ్ల భూదందాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement