శ్రమించు..లక్ష్యాన్ని ఛేదించు | Sakshi
Sakshi News home page

శ్రమించు..లక్ష్యాన్ని ఛేదించు

Published Tue, Dec 12 2023 1:22 AM

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న సివిల్స్‌ విజేత బాలలత  - Sakshi

● సాక్షి మీడియా గ్రూప్‌ –1, 2 పరీక్షల అవగాహన సదస్సుకు విశేష స్పందన ● సాధారణ తెలివితేటలతో అసాధారణ విజయాలు ● పోటీ పరీక్షలపై సివిల్స్‌ విజేత బాలలత సూచన

తిరుపతి కల్చరల్‌: ప్రణాళికాబద్ధంగా శ్రమిస్తే విజయం సాధించడం సుసాధ్యమని సివిల్స్‌ విజేత బాలలత తెలిపారు. సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించిన గ్రూప్‌–1, 2 పరీక్షలపై అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి సీఎస్‌బీ ఐఏఎస్‌ అకాడమీ నుంచి సివిల్స్‌ విజేత బాలలత ముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. ఆయా పరీక్షలకు అభ్యర్థులు ఎలా సమాయత్తం కావాలో ఆమె మార్గదర్శకం చేశారు. త్వరలో గ్రూప్స్‌ పరీక్షలకు నోటిఫికేషన్స్‌ రానున్న నేపథ్యంలో ఇప్పటినుంచే సన్నద్ధం కావాలన్నారు. సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఇష్టంగా ప్రయత్నం చేస్తే లక్ష్యాలు సులభతరమవుతాయన్నారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు సాధించాలనే ఆకాంక్షతో పాటు ఓర్పు, సహనం అవసరమని చెప్పారు. గ్రూప్స్‌ మాత్రమే హాజరవుతాం.. మిగిలిన పరీక్షలకు అక్కరలేదు అనే భావన నుంచి యువత బయటకు రావాలన్నారు. నోటిఫికేషన్లు వచ్చే అన్ని పరీక్షలకు అర్హులమేనన్న ఆలోచనతో హాజరు కావాలని సూచించారు. పాఠ్యపుస్తకాలు, అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పుస్తకాల ద్వారా విలువైన సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వం ముద్రించిన ప్రచురణలు, ఆయా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఉన్న సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లు, ఆర్థిక సర్వేలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నీతిఆయోగ్‌ వంటి సంస్థలు విడుదల చేసే సర్వేలను పరిశీలించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జరిగిన విపత్తులపై సైతం అవగాన కలిగి ఉండాలన్నారు. త్వరలో జరిగే ఎన్నికల సమాచారం, కేంద్ర పురస్కారాలు వంటి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలని తెలిపారు. జీవితం చాలా విలువైందని, యవ్వన దశ చాలా కీలకమని గుర్తించి ఈ దశలో అనుకున్న లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాలన్నారు.

భయం వీడండి

ఎస్‌డీహెచ్‌ఆర్‌ విద్యాసంస్థల అధి నేత డీవీఎస్‌.చక్రవర్తిరెడ్డి మాట్లాడుతూ ముందుగా భయాన్ని విడనాడి, తెలివిగా శ్రమించాలని చెప్పారు. ప్రశ్నల సరళిని అర్థం చేసుకునే నైపుణ్యం ఉంటే గెలుపు సుసాధ్యమన్నారు. సాక్షి బ్రాంచ్‌ మేనేజర్‌ బీ.సత్యేంద్రబాబు మాట్లాడుతూ ఇష్టపడి చేసే ఏపనైనా సులభతరంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కరస్పాండెంట్‌ మూర్తి, ఈవెంట్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

స్ఫూర్తిదాయకం

సివిల్‌ విజేత మేడమ్‌ బాలలత అందించిన చక్కటి సందేశం నాకు స్ఫూర్తినిచ్చింది. జాబ్‌ సాధిస్తానన్న నమ్మకం కలిగింది. ఇదే స్ఫూర్తితో, పట్టుదలతో ప్రయత్నం చేస్తా. గ్రూప్‌–1, 2 పరీక్షల నోటిఫికేషన్‌కు ముందే సాక్షి వారు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ఎంతో దోహదం చేసింది. సాక్షి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. – ఎం.జయంతి

ఇది లక్ష్యానికి నాంది

నోటిఫికేషన్‌కు ముందే సాక్షి నిర్వహించిన సదస్సు మా లక్ష్యాల ఛేదనకు ఎంతో దోహదం చేసేలా ఉంది. సదస్సులో చెప్పిన ప్రతి అంశం నాలో స్ఫూర్తిని రగిలించింది. ప్రయత్నిస్తే విజయం సాధిస్తామన్న నమ్మకం కలిగింది. ‘సాక్షి’ వారి మేలు మరువలేము. – మనోజ్‌ చక్కని మార్గదర్శకం

నేను గ్రూప్స్‌కు సిద్ధం కావాలని నిర్ణయంచుకున్నా. గ్రూప్స్‌ పరీక్షలకు ఎలా ప్రిపేర్‌ కావాలనే ఆలోచన ఉండేది. సాక్షి వారు నిర్వహించిన అవగాహన సదస్సు చక్కటి మార్గదర్శకతను చూపింది. మేడమ్‌ బాలలత అందించిన బోధనలు మాకు బాగా అవగతమయ్యాయి. పోటీ పరీక్షకు సన్నద్ధమయ్యే ధైర్యాన్ని ఇచ్చాయి. – లక్ష్మి

సమాధానం దొరికింది

యువత లక్ష్యాల పట్ల ఆకాంక్షను గు ర్తించి సాక్షి వారు గ్రూప్స్‌ పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయం. ఈ సందర్భంగా సివిల్‌ విజేత అయిన మేడమ్‌ బాల లత అందించిన బోధన నా ఆకాంక్షను మరింత పెంచింది. విజయ సాధనకు చక్కటి స్ఫూర్తినిచ్చింది. నాలో కలిగే సందేహాలకు సమాధానం లభించింది. – తనూష

విలువైన సమాచారం తెలుసుకున్నా

తొలి సారిగా గ్రూప్‌ పరీక్షలు రాయాలనుకుని డిసైడ్‌ అయ్యాను. ఇప్పుడు దీ నికి సాక్షి వారి అవగాహన సదస్సు వి లువైన సమాచారం నాకు ఎంతో దోహ దపడింది. మనోస్థైర్యాన్ని నింపింది. ప రీక్షలకు హాజరయ్యే వారికి ప్రాథమికంగా ఉండే అనేక అపోహలు, సందేహాలను ఈ సదస్సు ద్వా రా నివృత్తి చేశారు. సదస్సులో మేడమ్‌ అందించిన సూచనలతో పరీక్షలకు ముందుకు సాగుతాం. – పీ.శివకుమార్‌

సదస్సుకు హాజరైన అభ్యర్థులు
1/7

సదస్సుకు హాజరైన అభ్యర్థులు

డీవీఎస్‌.చక్రవర్తిరెడ్డి
2/7

డీవీఎస్‌.చక్రవర్తిరెడ్డి

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement
Advertisement