రవాణాశాఖలో ఏసీబీ గుబులు | Sakshi
Sakshi News home page

రవాణాశాఖలో ఏసీబీ గుబులు

Published Sat, Dec 30 2023 1:48 AM

ఏసీబీ సోదాల్లో పట్టుబడిన ఆభరణాలతో మధుసూదన్‌  - Sakshi

చిత్తూరు రూరల్‌: జిల్లా రవాణాశాఖలో ఏసీబీ గుబులు పట్టుకుంది. అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుడుతోంది. ఇందుకు ఎన్‌పోర్సుమెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాటకొండ వెంకట మధుసూదన్‌పై ఎసీబీ చేసిన దాడులే కారణం. ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల ఆస్తులు, ఆభరణాలతో ఆయన ఏసీబీ చేతికి చిక్కారు. మధుసూదన్‌కు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఏసీబీ యాప్‌కు ఇటీవల కొందరు ఫిర్యాదు చేశారు.

ఈమేరకు ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ అధికారులు రంగంలోకి దిగారు. చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, తిరుపతితో పాటు కర్ణాటకలో సైతం మధుసూదన్‌కు చెందిన ఇళ్లు, ఇతర భవనాల్లో సోదాలు మొదలు పెట్టారు. మూడు రోజులుగా కొనసాగుతున్న తనిఖీల్లో భారీగా ఆస్తులు వెలుగు చూశాయి. ఈ అవినీతి అధికారి అక్రమ సొమ్ముకు దళారులే వెన్నెముకగా నిలిచారనే ఆరోపణలు శాఖలో గుప్పుమంటున్నాయి.

దళారుల కన్నుసన్నల్లోనే...
నరహరిపేట, ఇతరత్ర చెక్‌పోస్టుల్లో ప్రైవేటు వ్యక్తులను కొందరు రవాణాశాఖ అధికారులు పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని యూనిట్‌ కార్యాలయాల్లో సైతం ఇదే తంతు కొనసాగుతున్నట్లు విమర్శలు వెలువెత్తుతున్నాయి. వీరికి అధికారం కట్టబెట్టి వాహనాలను మాటు వేస్తున్నట్లు సమాచారం. దళారులు చెక్‌పోస్టు ప్రాంతాల్లో అన్నీ తామై వ్యవహరిస్తూ అక్రమ రవాణాకు రైట్‌ రైట్‌ చెబుతున్నారనే ఫిర్యాదులున్నాయి.

కొంతమంది హోంగార్డులు సైతం చెక్‌ పోస్టుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కార్యాలయంలో పనిచేసే కొంతమంది అధికారులు వసూళ్ల పర్వంలో మునిగితేలుతున్నారు. మొత్తం మీద జిల్లా రవాణా శాఖల్లో ప్రైవేటు వ్యక్తులదే పైచేయిగా నిలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా మధుసూదన్‌పై జరిగిన దాడులతో అధికారుల్లో గుబులు పట్టుకుంది.

Advertisement
Advertisement