Sakshi News home page

ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. 

Published Wed, Jan 26 2022 6:53 AM

14 Year old Student Found Hanging in Etcherla Gurukul School - Sakshi

పరీక్ష బాగా రాయలేకపోయానన్న బాధ, తప్పు చేశానేమో అన్న అపరాధ భావం, టీచర్‌ మందలించారనే ఆవేదన.. కలగలిపి ఆ విద్యార్థి ఆలోచనలకు అడ్డుకట్ట వేసేశాయి. ఒక్క క్షణం స్థిమితంగా ఆలోచించలేని స్థితికి నెట్టేశాయి. బంగారు భవిష్యత్‌ ఉన్న ఆ యువకుడిని బలవన్మరణానికి ఉసిగొల్పాయి. ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎం పురం గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మంగళవారం పాఠశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశానికి గురై తల్లిదండ్రులకు విషాదం మిగిల్చాడు.  
 
ఎచ్చెర్ల (శ్రీకాకుళం​): ఎస్‌ఎంపురం ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొంచాడ వంశీ మంగళవారం పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు. బడిలోని 9వ తరగతి గదిలో మంగళవారం వేకువజామున 4 గంటల సమయంలో విద్యార్థి ఫ్యాన్‌కు తాడు కట్టి ఉరి వేసుకోగా.. నైట్‌ వాచ్‌మెన్‌ అప్పారావు ఉద యం 5 గంటలకు చూసి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లి విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. ప్రిన్సిపాల్‌ కిమిడి జగన్‌మోహన్‌రావు ఎచ్చెర్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జేఆర్‌ పురం సీఐ సీహెచ్‌ స్వామినాయుడు, ఎచ్చెర్ల ఇన్‌చార్జి ఎస్‌ఐ బాలరాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిది సంతకవిటి మండటం మిర్తివలస గ్రామం. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు కొంచాడ సింహాద్రి, రమణమ్మ, బంధువులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు పాఠశాలను రక్షణలోకి తీసుకున్నారు.
 
టీచర్‌ మందలించారని.. 
తోటి విద్యార్థుల కథనం మేరకు.. విద్యార్థులకు మరికొద్ది రోజుల్లో సమ్మెటివ్‌–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందుకు సన్నాహకంగా పాఠశాలలో సోమవారం 25 మార్కులకు హిందీ పరీక్ష నిర్వహించగా.. వంశీ బాగా రాయలేకపోయాడు. మార్కులు తక్కువ వస్తాయేమో అన్న భయంతో అదే ప్రశ్న పత్రం ఆధారంగా మరో జవాబు పత్రం రాసి అసలు ఆన్సర్‌ షీట్‌ స్థానంలో దీన్ని పెట్టేందుకు ప్రయత్నించాడు. ఇది హిందీ టీచర్‌కు తెలియడంతో విద్యార్థిని మందలించారు. ప్రిన్సిపాల్‌ వద్దకు తీసుకెళ్లి విషయం చెప్పారు.

చదవండి: (కీచక హెచ్‌ఎం.. విద్యార్థినితో రాసలీలలు.. వీడియోలు వైరల్‌)

అయితే ప్రిన్సిపాల్‌ దీనిపై స్పందిస్తూ.. ఇది సాధారణ పరీక్షేనని, మార్కులు తక్కువ వస్తే ఏమీ కాదని, ఇలా చేయడం తప్పని హితవు పలికారు. కానీ టీచర్ల మందలింపుతో విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సో మవారం రాత్రి రెండుమూడు సార్లు బాత్‌రూమ్‌కు వెళ్లే ప్రయత్నంగా చేయగా నైట్‌వాచ్‌మెన్‌ ప్రశ్నించడంతో మళ్లీ డార్మిటరీకి వెళ్లిపోయాడు. వేకువజామున 4 గంటలకు ఎవ్వరూ లేని సమయంలో 9వ తరగతి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్‌ కొట్టాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా.. మందలించారని ప్రిన్సిపాల్‌ చెబుతున్నారు. 

ఇద్దరు కుమారులు ఈ పాఠశాలలోనే... 
సంతకవిటి మండలం మిర్తివలస గ్రామానికి చెందిన కొంచాడ సింహాద్రి, రమణమ్మలకు ఇ ద్దరు కుమారులు. వంశీ 10వ తరగతి చదువుతుండగా, అతని తమ్ముడు కిరణ్‌ ఇక్కడే 9వ త రగతి చదువుతున్నాడు. వంశీ మంచి విద్యార్థి కూడా. ఉపాధ్యాయులతోనూ మంచి సత్సంబంధాలూ ఉన్నాయి. వీరిద్దరూ 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం పొందారు. చక్కగా చదువుకుంటున్న కుమారుడు ఒక్కసారిగా ఇలా దూరమైపోవడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరై విలపిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. గ్రామస్తులు కూడా వంశీ మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.   

చదవండి: (మొదటి భార్య నాలుగో కూతురు.. రెండో భార్య కొడుకు మధ్య ప్రేమ..)

పోలీసుల విచారణ.. 
పోలీసులు ఇటు విద్యార్థులు, ఉపాధ్యాయుల ను విచారిస్తున్నారు.  ప్రాథమికంగా కావాల్సిన ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.   

Advertisement
Advertisement