భారీ విధ్వంసానికి వ్యూహం: ఉగ్రవాదుల హతం

19 Nov, 2020 12:37 IST|Sakshi

శ్రీనగర్‌:  భారీ విధ్వంసానికి వ్యూహ రచన చేసినట్లు అనుమానిస్తున్న నలుగురు ఉగ్రవాదుల్ని భారత జవాన్లు హతమార్చారు. ఈ ఘటన  జమ్మూ -నాగ్రోటా టోల్‌ ప్లాజావద్ద జరిగింది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం వచ్చిన తర్వాత భద్రతా దళాలు నిఘా పెట్టాయి.  దీనిలో భాగంగా ఈ  గురువారం ఉదయం జరిగిన  ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మద్య కాల్పులు గంటల తరబడి జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికుని మెడకు తీవ్రగాయాలయ్యాయి.

అతని పరిస్థితి ఇప్పడు నిలకడగా ఉన్నట్లు తెలిసింది. బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద ఉదయం 5 గంటల సమయంలో వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు అటవీ ప్రాంతం వైపు పారిపోయారు. ఉగ్రవాదులు జమ్మూలోయ వైపు ప్రయాణిస్తున్న సమయంలో బాన్‌ టోల్‌ ప్లాజా వద్ద జరిగిన ఎదురు దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారీ ఆయుధాలు, పేలుడు పదార్ధాలు కల్గిన ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల వద్ద లభించిన భారీ పేలుడు పదార్థాలతో వారు విధ్వంసానికి వ్యూహ రచన చేసినట్లుగా అనుమానిస్తున్నారు. గత వారం జమ్మూ కాశ్మీర్‌ షోపియాన్‌లో భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు అల్‌-బదర్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల ఉనికిని తెలుసుకోవడానికి భద్రతా దళాలు జరిపిన సెర్చ్‌ ఆపరేషన్‌లో ఇద్దర్ని మట్టబెట్టారు.


 

మరిన్ని వార్తలు