Sakshi News home page

అమెరికాలో కిడ్నాపైన నాచారం విద్యార్థి అర్ఫాత్‌ మృతి 

Published Wed, Apr 10 2024 5:55 AM

Absurd student Arfaat died after being kidnapped in America - Sakshi

ఓహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మృతదేహం లభ్యం  

లభించిన ఆధారాలతో గుర్తించిన పోలీసులు  

కిడ్నాపర్లే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు అనుమానం   

మల్లాపూర్‌ (హైదరాబాద్‌): అమెరికాలో కిడ్నాప్‌ అయిన హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన విద్యార్థి మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌(25) ఓహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మృతి చెందాడు. అక్కడి సరస్సులో లభ్యమైన మృతదేహం నడుము చుట్టూ పాస్‌పోర్ట్, మొబైల్‌ఫోన్, కొన్ని పత్రాలు కట్టి ఉన్నాయి. వాటిని పరిశీలించిన పోలీసులు అర్ఫాత్‌గా గుర్తించారు.

ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ‘ఎక్స్‌’లో వెల్లడించింది. అర్ఫాత్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించింది. అర్ఫాత్‌ మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పింది.  

మార్చి 7న కిడ్నాప్‌: నాచారానికి చెందిన మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ గత మార్చి 7న అదృశ్యమయ్యాడు, ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన అర్ఫాత్‌ క్లీవ్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్నాడు. అయి తే కిడ్నాప్‌నకు కొద్ది రోజుల ముందు తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిందని అర్ఫాత్‌ తన తండ్రి మహమ్మద్‌ సలీంకు ఫోన్‌ చేసి చెప్పాడు, దీంతో వారు ఆందోళన చెందారు.

ఇది జరిగిన కొద్దిరోజులకే అర్ఫాత్‌ కిడ్నాప్‌ అయ్యాడు. 1200 డాలర్లు ఇస్తేనే విడిచి పెడతామని బెదిరించారని, లేకుంటే అర్ఫాత్‌ కిడ్నీలు విక్రయిస్తామని కిడ్నాప్‌ చేసినవారు సలీంను ఫోన్‌లో బెదిరించారు. అయితే అర్ఫాత్‌ను రక్షించుకునేందుకు తండ్రి సలీం అంగీకరించి,...అర్ఫాత్‌ మీ దగ్గర ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. దీంతో కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోన్‌ పెట్టేశారని, వారి నుంచి మళ్లీ కాల్‌ రాలేదని సలీం తెలిపారు.
కిడ్నాపర్‌ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఎవరిదో ఏడుపు వినిపించిందని..అదే చివరి గొంతు అన్నారు. కిడ్నాపర్ల ఫోన్‌నంబరు అమెరికాలోని తమ బంధువులకు పంపి క్లీవ్‌ల్యాండ్‌ పోలీసులకు అందజేయాలని సలీం చెప్పారు. అర్ఫాత్‌ అదృశ్యంపై అతడి బంధువులు మార్చి 8న క్లీవ్‌ల్యాండ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లుకౌట్‌ నోటీసు జారీ చేశారు. ఇది జరిగిన దాదాపు నెలరోజుల తర్వాత విషాదవార్త వినాల్సి వచ్చిందని కుటుంబసభ్యులు రోదిస్తూ చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement