బయట పెట్టమంటావా.. రూ.2 కోట్లు చెల్లిస్తావా.. | Sakshi
Sakshi News home page

బయట పెట్టమంటావా.. రూ.2 కోట్లు చెల్లిస్తావా..

Published Mon, Jul 26 2021 9:09 PM

ACB Has Arrested A Deputy Sp And Constable In Bribe Case - Sakshi

ముంబై: మహారాష్ట్రలో ఇద్దరు పోలీసులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. ఓ వ్యాపారి స్నేహితుడి మరణానికి సంబంధించి డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర పాల్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.10 లక్షలను  చెల్లించే క్రమంలో ఏసీబీ రెడ్‌ హ్యాండెడ్‌గా కానిస్టేబుల్ గణేష్ చావన్‌ను పట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మే 2 న పర్భనిలోని సెలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ 35 ఏళ్ల వ్యాపారి మరణించాడు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో అతడిని వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనపై మే 3న సెలు పోలీస్ స్టేషన్‌లో ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదైంది.

అయితే కొన్ని నెలల తర్వాత, మరణించిన వ్యక్తి భార్య అతడి స్నేహితుడు మాట్లాడుకున్న ఓ ఆడియో టేప్‌ వైరల్‌ అయ్యింది. ఇదే అదునుగా భావించిన డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర పాల్ సదరు వ్యక్తిని రూ.2 కోట్లు చెల్లించమని బెదిరింపులకు దిగాడు. దీంతో సదరు వ్యక్తి ముంబైలోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఇందోలో భాగంగా మొదటి విడత రూ.10 లక్షలు కానిస్టేబుల్ గణేష్ చావన్‌ నివాసంలో చెల్లించడానికి అంగీకరించాడు. దీంతో ఏసీబీ అధికారులు కానిస్టేబుల్‌ను  రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీని వెనుక డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర పాల్ ఉన్నట్లు తేలడంతో.. అవినీతి నిరోధక చట్టం 1988 కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

Advertisement
Advertisement