పెళ్లి చేసుకుంటానని మోసం: పోలీసుల ఎదుటకు హీరో ఆర్య

11 Aug, 2021 13:21 IST|Sakshi

చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నెలో కమిషనర్‌ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్‌ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్‌ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేస్తూనే ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు.

ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషా​ సైగల్‌తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు