టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర  | Sakshi
Sakshi News home page

టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర 

Published Wed, Mar 13 2024 5:14 AM

Anger spread across the state over Geetanjalis death - Sakshi

గీతాంజలి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన ఆగ్రహ జ్వాలలు 

ఈ నైచ్యానికి అంతులేదు. ఈ మానవ మృగాలకు బుద్ధి రానే రాదు. ప్రభుత్వ పథకాలు తమ కుటుంబానికి మేలు చేశాయన్నందుకు.. బీసీ మహిళ గీతాంజలిని వీధి కుక్కల్లా వెంటాడారు. వేధించారు. థర్డ్‌డిగ్రీకి పదింతల ఆన్‌లైన్‌ టార్చర్‌కు గురిచేశారు. తట్టుకోలేక ఆమె రైలు కింద పడి తనువు చాలించినా ఈ దరిద్రులకు సిగ్గురాలేదు. రైల్వేస్టేషన్‌ దగ్గర ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సమయంలో ఎవరో తీసిన రెండు నిమిషాల వీడియోలో మాటల్ని ఎడిట్‌ చేసి మరీ.. చనిపోయాక కూడా ఆమెను చిత్రవధ చేయడం మొదలెట్టారు.

‘ఎవరో ఇద్దరు నెట్టేశారంట’ అనే మాటల్ని వీడియోకు కొత్తగా జోడించి దాన్ని ‘ఎక్స్‌’లో తెలుగుదేశం పార్టీ అధికారిక హ్యాండిల్‌లోనే పోస్ట్‌ చేసిందంటే ఏమనుకోవాలి? వీళ్లకసలు సిగ్గూ.. లజ్జా.. ఏమైనా ఉన్నాయా? పైపెచ్చు అవే ఎడిటెడ్‌ మాటల్ని వైరల్‌ చేస్తూ.. నెట్టేసిన ఇద్దరూ ఎవరు? ఆమెతో ఎందుకు వెళ్లారు? అంటూ టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా మాఫియా పలు పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తోందంటే ఏమనుకోవాలి?

గీతాంజలి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలియగానే.. ఆమెపై చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని తమ సోషల్‌ మీడియా హ్యాండిల్స్‌ నుంచి తొలగించి తప్పించుకోవాలని చూస్తున్న ఈ రాక్షసుల్ని ఏం చేయాలి? వీళ్లదసలు మనిషి పుట్టుకేనా? వీళ్లకు కుటుంబాలున్నాయా?

సాక్షి, అమరావతి/రేపల్లె రూరల్‌/తెనాలి రూరల్‌/ సాక్షి నెట్‌ వర్క్‌:‘పురాణాల్లో దుశ్శాసనుడు కూడా ఇంతదారుణంగా వ్యవహరించి ఉండక­పో­వచ్చు.. ఇప్పుడు ఆయనే ఉంటే మానమృగాలైన టీడీపీ–­జనసేన సైకో మూకల తీరు చూసి సిగ్గు పడేవాడు.. ట్రోలింగ్‌తో వెంటపడి, వేటాడి గీతాంజలి మృతికి కారణమైన ఈ సైకోలందరినీ కఠినంగా శిక్షించాల్సిందే’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఆడబిడ్డ అన్యాయంగా చనిపోయిందనే కనికరం కూడా లేని ఆ పార్టీల అధినేతలు.. మహిళా సాధికారత గురించి మాట్లా­డు­తుండటం దయ్యాలు వేదాలు వల్లించిన­ట్లుందన్నారు.

సంక్షేమ పాలనకు ప్రజలు విశేషంగా ఆకర్షితు­లవుతుంటే తట్టుకోలేని ఈ మానవ మృగాల టార్గెట్‌తో ఒక నిండు ప్రాణం బలై­పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు చిన్నా­రులు తల్లి ప్రేమ కోల్పోయి దిక్కుతోచని వార­య్యా­రని, ఇందుకు బాధ్యత వహించాల్సింది చంద్ర­బాబు, పవన్‌­లేనని స్పష్టం చేశారు. ఈ వ్యవ­హారంపై జాతీయ మీడి­యా సైతం స్పందించింది. మితి­మీరిన ట్రోలింగ్‌లకు ముకుతాడు వేయాలని వార్తలు ప్రసారం చేసింది. 

సర్వత్రా ఆగ్రహం
టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా సైకోల కారణంగా మృతి చెందిన గీతాంజలికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు, నేతలు నివాళులర్పించారు. ఈ ఘటనను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే వెంకటేశ్‌గౌడ్, వైఎస్సార్‌సీపీ నెల్లూరు నాయకురాలు మోయిళ్ల గౌరి, విశాఖపట్నం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలో పలు చోట్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి కర్రి వేణుమాధవ్‌ ఆధ్వర్యంలో బీచ్‌ రోడ్డులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 

  వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గుంటూరు నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు చర్చి సెంటర్‌లో బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి, వైఎస్సార్‌ సీపీ మహిళా నేతలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ శిఖామణి సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఐడీసీ ఛైర్‌పర్సన్‌ బండి నాగేంధ్ర పుణ్యశీల, మహిళా నేతలు ర్యాలీ నిర్వహించారు. 

ఇది టీడీపీ, జనసేన సైకోల హత్య
‘గీతాంజలిది ఆత్మహత్య కాదు. టీడీపీ, జనసేన సైకోలు చేసిన హత్యగానే పరిగణించాలి. సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తూ మానసికంగా వేధించడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపో­యిన తల్లి పార్థివదేహం వద్ద ఇద్దరు చిన ఆడబి­డ్డలు ఏడుస్తుంటే చూసిన ప్రతీ ఒక్కరూ చలించిపో­యారు.

తన సొంతింటి కల నెరవేర్చిన వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వాన్ని ఆమె గుండెల్లో పెట్టుకోవడమే పాపమైపోయిందా? సీఎం జగన్‌ను మళ్లీ గెలిపించుకుంటామని చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా? టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు మరీ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? తల్లిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడబిడ్డల భవిష్యత్తేంటి? మీ సోషల్‌ మీడియా సైకోలు తల్లి మమకారాన్ని తిరిగి తెస్తాయా?

తన భార్య ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నందునే టీడీపీ, జనసేన సైకోలు సోషల్‌మీడియా ట్రోల్స్‌తో ఆమె తీవ్రంగా మనోవ్యధకు గురైందని.. ఆరోజు రాత్రి, తెల్లవారుజామున కూడా ఆమె ఆ రెండు పార్టీల సోషల్‌ మీడియా దుర్మార్గులు పెట్టిన కామెంట్లు చదివి బాధ పడిందని గీతాంజలి భర్త చెబుతుంటే బాధేస్తోంది. ఐటీడీపీ నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న సోషల్‌ మీడియా సంస్థ. కానీ, దీన్ని ఐటీడీపీ అనేకంటే ఉగ్రవాద సంస్థగా చెప్పాలి. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు



మహిళను బలితీసుకునే అధికారం ఎక్కడిది?
టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాల కోసం మహిళను బలితీసుకునే అధికారం ఎవరిచ్చారు? ఆ పార్టీల సోషల్‌ మీడియా రాబంధుల వికృత చేష్టలతో ఒక మహిళ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారు. టీడీపీ–జనసేన సోషల్‌ మీడియా కార్యకర్తలు మనుషులా? మృగాలా? తన కూతురికి అమ్మ ఒడి వచ్చిందని, అత్తకు చేయూత, తన మామకు పింఛన్‌తో కలిపి మొత్తం ఇంటిలో నాలుగు పథకాలు వచ్చాయని చెప్పడంతో పచ్చ మందకు కళ్లు కుట్టాయి.

ఇలాంటి ఘటనలతో పైశాచిక ఆనందాన్ని పొందేందుకేనా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు రూ.కోట్లు వెచ్చించి సోషల్‌ మీడియాను నడుపుతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు.. మహిళల సంక్షేమా­నికి ఏం చేశారు. ఆయన హయాంలోనే బడుగు బలహీన వర్గాల పిల్లలు అంతర్జాతీయ వేదికల్లో  ఇంగ్లిష్‌లో మాట్లాడటాన్ని కూడా తట్టుకోలేక వారిపైనా ట్రోలింగ్‌తో నీచపు రాజకీయం చేశారు. – పోతుల సునీత, ఎమ్మెల్సీ



కక్షగట్టి ట్రోలింగ్‌
గీతాంజలి మృతికి కారణమైన బాధ్యులకు శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ప్రభుత్వం వల్ల తనకు మంచి జరిగిందని గీతాంజలి గట్టిగా చెప్పడం టీడీపీ, జనసేనకు నచ్చలేదు. అందుకే పనిగట్టుకుని, కక్షతో ట్రోలింగ్‌కు గురిచేశారు.

మానసిక చిత్రహింస తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఒక సామాన్య మహిళపై అసభ్యకరంగా పోస్ట్‌లు పెట్టేవారిని సభ్యసమాజంలోని ప్రతి వ్యక్తి ఖండించాలి. తాము పొందిన లబ్ధి గురించి తెలియజేస్తున్న ప్రజల స్వేచ్ఛను  హరించేలా టీడీపీ–జనసేనల సోషల్‌ మీడియాల్లో వికృతంగా వ్యవహరించడం దారుణం.  – మోపిదేవి వెంకట రమణారావు, ఎంపీ

మనిషిని బతికించేలా మాట ఉండాలి
మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని బతికించేలా ఉండాలి. టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు బలైన గొల్తి గీతాంజలి కుటుంబానికి సీఎం వైఎస్‌ జగన్‌ అండగా నిలవడం ప్రశంసనీయం. సోషల్‌ మీడియాలో ఇలాంటి అసభ్యకర పదజాలం వాడేవారిని శిక్షించాలి.  – జి.శాంతమూర్తి,  వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం వ్యవస్థాపకులు 

దోషులను వదిలేది లేదు: ఎస్పీ 
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సోషల్‌ మీడియా ట్రోలింగ్‌ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసు విచారణ వేగవంతం చేశామని, దోషులను వదిలేది లేదని గుంటూరు ఎస్పీ తుషార్‌డూడీ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి ఆయన విలేక­రుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడో తేదీ ఉదయం 11 గంటలకు తెనాలికి చెందిన గీతాంజలి(32) తెనాలి ఐదో నంబర్‌ ఫ్లాట్‌ఫాం సమీపంలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ కింద పడే ప్రయత్నం చేసిందని తెలిపారు.

ఆమె 11వ తేదీ అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ మరణించిందన్న సమా­చారం మేరకు తెనాలి రైల్వే పోలీసులు 174 సెక్షన్‌ కింద  కేసునమోదు చేశారని చెప్పారు. ఈ కేసును రైల్వే పోలీసుల నుంచి తెనాలి వన్‌టౌన్‌కు బదిలీ చేశారని, రైల్వే పోలీ­సుల విచారణ నివేదిక ఆధారంగా కేసును సెక్షన్‌ 174 నుంచి ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు  సెక్షన్‌ 306కి మార్పు చేయడం జరిగిందన్నారు.

గీతాంజలి తనకు ఇంటి పట్టా వచ్చిందన్న  ఉత్సా­హంలో చేసిన వీడియోను పోస్టు చేసి­నం­­దుకు ఆమెను చనిపోయేలా కించపరిచా­రన్నారు.  ఇప్పటికే ట్రోల్‌ చేసిన వారి హ్యాండిల్స్‌ను గుర్తించామని, ఇందులో కొంతమంది తమ పేరుతోనే అకౌంట్‌ నడుపుతుంటే మరి­కొందరు ఫేక్‌ అకౌంట్‌లు నడుపుతు­న్నారు. వీరందరిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసు బృందాలను నియమించామన్నారు.

మానవత్వం లేని నాదెండ్ల
తెనాలి పట్టణం వహాబ్‌చౌక్‌ ఇస్లాంపేటకు వెళ్లే రోడ్డు ప్రారంభంలోనే ఉన్న గీతాంజలి ఇంటి ముందు పెద్ద ఎత్తున జనం గుమిగూడి జరిగిన ఘటన గురించి చర్చించుకుంటున్న తరుణంలో జనసేన నేత నాదెండ్ల తీరు విమర్శలకు దారితీసింది. గీతాంజలి ఇంటికి కూత వేటు దూరంలోనే ఆయన నవ్వుతూ 
ఎన్ని­కల ప్రచారం నిర్వహించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ‘ఈయనేం లీడర్‌.. మానవత్వం లేదా?’ అని పలు­వురు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement