ప్రాణం తీసిన చైనా మాంజా! | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన చైనా మాంజా!

Published Mon, Jan 15 2024 6:08 AM

Army Officer Died Due To Kites And China Manza In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/లంగర్‌హౌస్‌: హైదరాబాద్‌కు అక్రమంగా దిగుమతి అయిన చైనా మాంజా ఓ ఆర్మీ అధికారి ప్రాణం తీసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా పెదవాల్తేరుకు చెందిన కాగితాల కోటేశ్వర్‌రెడ్డి ఆర్మీలో నాయక్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో ఉన్న మిలటరీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. భార్య ప్రత్యూష, రెండేళ్ల కుమార్తెతో కలిసి బాపునగర్‌లో నివసిస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు శనివారం ద్విచక్ర వాహనంపై బాపునగర్‌ నుంచి లంగర్‌హౌస్‌ వైపు వస్తున్నారు.

సాయంత్రం 6.30 గంటల సమయంలో లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న ఆయన మెడకు ఎగురుకుంటూ వచ్చి న పతంగికు కట్టిఉన్న చైనా మాంజా చుట్టుకుంది. ఆయన అప్రమత్తమయ్యేలోపే మాంజా గొంతుకు బిగుసుకుని కోసుకుపోయింది. దీంతో గొంతుపై తీవ్రగాయమై కోటేశ్వర్‌రెడ్డి వాహనంపైనుంచి కింద పడిపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న ఆయన్ను గుర్తించిన స్థానికులు చికిత్స కోసం ఆయన పనిచేసే మిలటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు రెండు గంటలపాటు శ్రమించినా ఫలితం దక్కలేదు. కోటేశ్వర్‌రెడ్డి చికిత్స పొందుతూ శనివారం రాత్రి 9.30 సమయంలో కన్నుమూశారు. కేసు నమోదు చేసుకున్న లంగర్‌హౌస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.  

కట్టడి చేసినా.. విచ్చలవిడిగా... 
మనుషులతో పాటు పక్షులు, ఇతర ప్రాణులకు ముప్పు కలిగించే చైనా మాంజాను కట్టడి చేయా లని నగర పోలీసులు గత నెల నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మాంజా రవాణా, నిల్వ, విక్రయంపై నిఘా ఉంచి అనేక కేసులు నమోదు చేశా రు. అయినప్పటికీ ధనార్జనే ధ్యేయంగా అనేక మంది వ్యాపారులు చైనా మాంజాను అక్రమంగా తీసుకువచ్చి విక్రయించారు. శని, ఆదివారాల్లో ఈ మాంజా ప్రభావం నగరవ్యాప్తంగా కనిపించింది. అనేక మంది వాహనచోదకులు దీని బారినపడి గాయప డ్డారు. రాజధానిలోని అనేక ప్రాంతాల్లో పక్షులు ఈ మాంజా కారణంగా తీవ్రంగా గాయపడటం, చనిపోవడం కనిపించింది. నగరంలోని దాదాపు అన్ని ఫ్లైఓవర్లు ‘డేంజర్‌ జోన్లు’గా మారాయి. మాంజా కారణంగా వాహనాలు సడన్‌గా వేగాన్ని తగ్గించడం.. వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టడంతో పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 

Advertisement
Advertisement