Basara IIIT Inter Student Bunny Missing At Nizamabad - Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి మిస్సింగ్‌ కలకలం.. బన్నీకి ఏమైంది?

Published Mon, Jul 10 2023 3:00 PM

Basara IIT Inter Student Bunny Missing At Nizamabad - Sakshi

సాక్షి, బాసర: నిజామాబాద్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీలో మరో కలకలం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. సదరు విద్యార్థి మూడు రోజులుగా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో విద్యార్థి పేరెంట్స్‌ ఆందోళనకు గురవుతున్నారు. దీంతో, తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు.

వివరాల ప్రకారం.. బాసర ట్రిపుల్‌ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న బన్నీ(18) ఏళ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. అతడి స్వస్థలం మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం నర్సంపల్లి. ఈ నెల 6న తాను ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి ఔట్‌పాస్‌ తీసుకున్నాడు. వర్సిటీ నిబంధనల మేరకు సిబ్బంది అతడికి ఔట్‌పాస్‌ జారీ చేశారు. అయితే, బన్నీ మాత్రం ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్‌ ఆఫ్ చేసి ఉంది. విషయం తెలిసిన తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. మూడు రోజులుగా బన్నీ ఫోన్ చేయకపోవడం.. తాము ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుండడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఆదివారం హాస్టల్‌కు వచ్చి ఆరాతీశారు.

కాగా, బన్నీ ఇంటికి వెళ్తుతున్నానని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లినట్టుగా యాజమాన్యం తెలిపింది. దీంతో షాక్ అయిన తల్లిదండ్రులు.. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా పంపుతారని యాజమాన్యాన్ని నిలదీశారు. బన్నీ ఎక్కడికి వెళ్లాడో తెలియకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, ఇంటికి వెళ్లకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేప​ట్టినట్టు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఈటల, అర్వింద్‌కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

తప్పక చదవండి

Advertisement