Cyber Crime News Today: Begumpet Girl Trapped By Nigerian By Social Media Hyderabad - Sakshi
Sakshi News home page

వరుడొస్తాడనుకుంటే పోలీసులొచ్చారు!

Published Thu, Jan 6 2022 7:04 AM

Begumpet Girl Trapped By Nigerian By Social Media Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ఉత్తర మండల పరిధిలో ఉన్న బేగంపేట ప్రాంతానికి చెందిన యువతికి చేదు అనుభవం ఎదురైంది. సోషల్‌మీడియా ద్వారా పరిచయమైన వరుడు తనను వెతుక్కుంటూ వస్తాడని భావిస్తున్న తరుణంలో కర్ణాటక పోలీసులు వచ్చారు. అక్కడ నమోదైన ఓ సైబర్‌ నేరంలో తనతో పాటు తన స్నేహితుడూ పావుగా మారామని తెలుసుకుని అవాక్కైంది. ఉడిపి పోలీసుల ఆదేశాల ప్రకారం మంగళవారం బేగంపేట ఠాణాకు వచ్చిన ఆ ఇద్దరూ తమకు ఏ పాపం తెలియదంటూ నెత్తినోరు బాదుకున్నారు. ఈ ఉదంతం పూర్వాపరాలు ఇలా ఉన్నాయి..
నైజీరియాకు చెందిన ఓ నేరగాడు ఢిల్లీ కేంద్రంగా మాట్రిమోనియల్‌ నేరాలు చేస్తున్నాడు. ఇతడికి కొ న్నాళ్ల క్రితం ఇన్‌స్ట్రాగామ్‌ యాప్‌ ద్వారా బేగంపేట ప్రాంతానికి చెందిన యువతి పరిచయమైంది.  
► తాను విదేశంలో ఉంటున్న ప్రైవేట్‌ సంస్థ ఉన్నతోద్యోగిగా ఆమెను నమ్మించాడు. స్నేహంగా కొన్నాళ్లు చాటింగ్‌ చేసిన అతగాడు ఆపై ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. బేగంపేట యువతి సైతం అతడిని నమ్మింది. 
► తాను త్వరలోనే హైదరాబాద్‌కు వచ్చి కలుస్తానంటూ యువతిని నమ్మించాడు. తన వద్ద కొంత మొత్తం ఉందని, దాన్ని తనతో తీసుకురావడానికి సాంకేతిక ఇబ్బందులు వస్తాయంటూ... అది డిపాజిట్‌ చేయడానికి బ్యాంకు ఖాతా వివరాలు కావాలన్నాడు.  
► దీంతో ఆ యువతి బేగంపేట ప్రాంతానికే చెందిన తన స్నేహితుడి పేరుతో బ్యాంకులో ఖాతా తెరిచింది. దానికి అనుసంధానించడానికి అతడి పేరుతో ఓ సెల్‌ఫోన్‌ నెంబర్‌ కూడా తీసుకుంది.  
► బ్యాంకు ఖాతా వివరాలతో పాటు డెబిట్‌ కార్డు, చెక్‌బుక్, అనుసంధానించిన ఫోన్‌ నెంబర్‌కు సంబంధించిన సిమ్‌కార్డులను ఢిల్లీలో ఉండే తన స్నేహితుడికి పంపాలంటూ నగర యువతిని నైజీరియన్‌ సూచించాడు. దీంతో ఆమె వాటిని కొరియర్‌ చేసింది. 
► ఇదే నేరగాడు కర్ణాటకలోని ఉడిపి ప్రాంతానికి చెందిన ఓ యువతినీ ట్రాప్‌ చేశాడు. తమ ప్రేమకు గుర్తుగా ఆమెకు కొన్ని బహుమతులు పంపుతున్నట్లు నమ్మించాడు. ఆపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ కస్టమ్స్‌ అధికారుల మాదిరిగా ఫోన్లు చేశాడు. 
► ఖరీదైన గిఫ్ట్‌లు వచ్చినందుకు పన్నులు కట్టాలంటూ ఆమె నుంచి రూ.19 లక్షలు స్వాహా చేశాడు. ఈ డబ్బును ఆమె ఢిల్లీకి చెందిన తొమ్మిది ఖాతాల్లోకి బదిలీ చేసింది. హైదరాబాద్‌కు చెందిన మరో ఖాతాలోకి రూ.లక్ష బదిలీ చేయమనడంతో అనుమానించింది. 
► తాను మోసపోయానని గుర్తించి ఉడిపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అధికారులు నగదు బదిలీ చేసిన తొమ్మిది ఖాతాలు నకిలీ వివరాలతో తెరిచినట్లు గుర్తించారు. డబ్బు డిపాజిట్‌ చేయనప్పటికీ బాధితురాలి ఒత్తిడి మేరకు హైదరాబాద్‌ ఖాతా వివరాలు ఆరా తీశారు. 
► దీంతో పాటు అనుసంధానించి ఉన్న సెల్‌ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా బేగంపేట యువకుడిని గుర్తించారు. మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌కు బాధితురాలితో సహా వచ్చిన ఉడిపి పోలీసులు సహకారం కోరారు. 
ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గంగాధర్‌ వీరికి సహకరించారు. బేగంపేటలో యువకుడిని అదుపులోకి తీసుకున్న ఉడిపి పోలీసులు స్థానిక ఠాణాకు తరలించారు. అతడిని విచారించిన నేపథ్యంలోనే తాను ఫలానా యువతి కోరడంతోనే తాను వాటిని ఇచ్చానని చెప్పాడు. 
► అతడు చెప్పిన వివరాల ఆధారంగా యువతిని సైతం ఉడిపి పోలీసులు విచారించారు. దీంతో ఆ మెను సైతం విచారించిన ఉడిపి పోలీసులకు అ సలు విషయం తెలిసింది. అయితే బాధిత యువ తి మాత్రం వీళ్లిద్దరూ నైజీరియన్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని వాదించింది. దీన్ని తోసిపుచ్చిన పోలీసులు నగరవాసుల్ని విడిచిపెట్టారు. 

Advertisement
Advertisement