నల్లగొండ జిల్లాలో ఓ తల్లి దారుణం: పుట్టుకతోనే కళ్లు లేని కొడుకు.. పేగు బంధాన్ని మరచిన కన్నతల్లి..

27 Feb, 2022 04:39 IST|Sakshi
కొడుకు గోపీచంద్‌ , తల్లి శైలజ  

మిర్యాలగూడ: ఓ తల్లి పేగు బంధాన్ని మరిచి అంధుడైన కుమారుడిని సాగర్‌ ఎడమ కాల్వలోకి తోసేసింది. దీంతో ఆ బాలుడు గల్లంతయ్యాడు. అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామానికి చెందిన నల్లగంతుల సోములు, శైలజ దంపతులకు ముగ్గురు సంతానం.

ఎనిమిదేళ్ల క్రితం భర్త సోములు చనిపోవడంతో శైలజ కొంతకాలంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీలో ముగ్గురు కుమారులైన రాజు, గోపీచంద్‌ (14), యోగేశ్‌లతో కలిసి అద్దె ఇంట్లో ఉంటోంది. అక్కడే పలువురి ఇళ్లల్లో పనిచేస్తూ కుమారులను పోషిస్తోంది. మొదటి కుమారుడు రాజు నల్లగొండ లో ఇంటర్‌ మొదటి సంవత్సరం, మూడో కుమారుడు యోగేశ్‌ 4వ తరగతి చదువుతున్నారు.

రెండో కుమారుడైన గోపీచంద్‌ పుట్టుకతో అంధుడు కావడంతో నల్లగొండ పట్టణంలోని బధిరుల పాఠశాలలో చేర్పించారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. గోపీచంద్‌ వయస్సు పెరుగుతున్నకొద్దీ మానసిక స్థితిని కోల్పోతూ తోటి విద్యార్థులను గాయపరుస్తుండటంతో ఈ విద్యా సంవత్సరం బాలుడిని చేర్పించుకునేందుకు ఇష్టపడలేదు.  

సాగర్‌ ఎడమ కాల్వ వంతెన దగ్గర బాలుడిని తోసేసి.. 
బాలుడి చేష్టలతో విసుగు చెందిన తల్లి.. అతడిని తీసుకొని శనివారం నల్లగొండ నుంచి బస్సులో బయలుదేరింది. వేములపల్లి మండల కేంద్రానికి చేరుకుంది. అక్కడ నుంచి సాగర్‌ ఎడమ కాల్వ వంతెన సమీపంలో కుమారుడు గోపీచంద్‌ను నీటిలోకి తోసేసింది. అక్కడ ఈత కొడుతున్న ఇద్దరు యువకులు ఇది గమనించి పోలీసులకు సమాచా రం అందించారు. వాళ్లు వెంటనే శైలజను అదుపులోకి తీసుకున్నారు. బాలుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు