దొరికాడు దొంగ | Sakshi
Sakshi News home page

దొరికాడు దొంగ

Published Sat, Apr 13 2024 5:31 AM

This is Chandrababu naidu corruption skill - Sakshi

‘స్కిల్‌’బెడిసికొట్టి కటకటాల్లోకి..

సీమెన్స్‌ కంపెనీ ముసుగులో భారీ దోపిడీ  

కుట్రదారు,లబ్దిదారు చంద్రబాబే  

A1 చంద్రబాబు అరెస్ట్‌... 

అవినీతి నెట్‌వర్క్‌ ద్వారాచంద్రబాబు బంగ్లాకు రూ.241కోట్లు 

రాజమహేంద్రవరంసెంట్రల్‌ జైల్లో 52 రోజులు 

సీఐడీ దర్యాప్తుల్లో ఆధారాలతోసహా వెల్లడి 

17ఏ కింద చంద్రబాబుకు రక్షణ లభించదన్న సుప్రీంకోర్టు 

షెల్‌ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు 

కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తరహా లోనే చంద్రబాబుపై ఈడీ కన్ను 

ఇదీ చంద్రబాబు అవినీతి ‘స్కిల్‌’

సాక్షి, అమరావతి: ‘స్కిల్‌’ స్కామ్‌... చంద్రబాబుకు ఎప్పటికీ వెంటాడే పీడకల...40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ యథేచ్ఛగా అవినీతికి పాల్పడిన ట్రాక్‌ రికార్డు ఉన్న చంద్రబాబును ఖైదీ నంబర్‌ 7691గా 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు ఊచలు లెక్కించేలా చేసింది ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణం. యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణ పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఈ కేసులో సీఐడీ చంద్రబాబుతో పాటు 8 మందిని అరెస్ట్‌ చేసింది. చంద్రబాబును ఏ1గా పేర్కొంటూ ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్‌ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్‌ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు.

ఈ కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌  షెల్‌ కంపెనీల ప్రతినిధులు నలుగురిని అరెస్ట్‌ చేసింది. డిజైన్‌ టెక్‌కు చెందిన రూ.31.20 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌( కాగ్‌) స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. చంద్రబాబు 17ఏ చట్టం కింద ఈ కేసు నుంచి తప్పించుకోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఇదే తరహాలో షెల్‌ కంపెనీల ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీకి నిధులు పొందిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడం సరైన చర్యేనని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మరి అదే తరహాలో స్కిల్‌స్కామ్‌కు పాల్పడి షెల్‌కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి నిధులు మళ్లించిన చంద్రబాబుపై ఈడీ కత్తి వేలాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు స్కిల్డ్‌ క్రిమినల్‌ అని నిర్ధారిస్తూ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణం కథ కమామిషు ఇలా ఉంది... చంద్రబాబు అవినీతి నెట్‌వర్క్‌ ఇదీ..

టీడీపీ ప్రభుత్వం పుణెకు చెందిన డిజైన్‌ టెక్‌కంపెనీకి రూ.371 కోట్లు చెల్లించింది.  
డిజైన్‌ టెక్‌ కంపెనీ నుంచి పుణెలోని పీవీఎస్‌పీ అనే షెల్‌ కంపెనీకి రూ.238.29 కోట్లు, ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రూ.2.71 కోట్లు అంటే మొత్తం రూ.241 కోట్లు తరలించారు.  
 పీవీఎస్‌పీ కంపెనీ నుంచి మళ్లీ ఢిల్లీ, ముంబై,అహ్మదాబాద్‌లో ఉన్న వివిధ షెల్‌ కంపెనీలతోపాటు దుబాయ్, సింగపూర్‌లోని కంపెనీలకు నిధుల తరలింపు ఇలా సాగింది... 
     ఏసీఐ: రూ.56 కోట్లు 
     నాలెడ్జ్‌ పోడియమ్‌: రూ.45.28 కోట్లు 
     ఈటా: రూ.14.1 కోట్లు 
     పాట్రిక్స్‌: రూ.3.13 కోట్లు 
     ఐటీ స్మిత్‌: రూ.3.13 కోట్లు 
     భారతీయ గ్లోబల్‌: రూ.3.13 కోట్లు 
     ఇన్‌వెబ్‌: రూ.1.56 కోట్లు 
     పోలారీస్‌: రూ.2.2 కోట్లు 
     కాడెన్స్‌ పార్టనర్స్‌: రూ.12 కోట్లు 
మొత్తం రూ.140.53 కోట్లను ఆ కంపెనీల బ్యాంకు ఖాతాల నుంచి యోగేశ్‌ గుప్తా డ్రా చేసి మనోజ్‌ వాసుదేవ్‌ పార్థసానికి అందించారు. మనోజ్‌ పార్ధసాని ఆ నగదు మొత్తాన్ని చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో ముట్టజెప్పారు. అంటే ఆ రూ.140.53 కోట్లను చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  
 ఇక మిగిలిన రూ.100.47 కోట్లను పీవీఎస్‌పీ కంపెనీ దుబాయి, సింగపూర్‌లోని కంపెనీలకు మళ్లించింది. ఆ నిధులను మళ్లీ హవాలా మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ మనోజ్‌ పార్థసాని ద్వారా చంద్రబాబు పీఎస్‌ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించారు. అనంతరం చంద్రబాబు బంగ్లాకు చేర్చారు.  
ఏపీఎస్‌ఎస్‌డీసీకి చెందిన రూ.241 కోట్లు అవినీతి నెట్‌వర్క్‌ ద్వారా ఇలా గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బంగ్లాకు వచ్చి చేరాయి.  

370 కోట్ల నుంచి 3,300 కోట్ల రూపాయలకు పెంచేసి.. 
2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అనంతరం తన బినామీ సంస్థ డిజైన్‌ టెక్‌ను రంగంలోకి దింపి ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.   ఈ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు బినామీలు, సన్నిహితులైన అప్పటి ఏపీఎస్‌ఎస్‌డీసీకి డైరెక్టర్‌గా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె. లక్ష్మీనారాయణ, ఎండీగా ఉన్న గంటా సుబ్బారావు కీలకంగా వ్యవహరించారు.

ప్రాథమిక నివేదిక ప్రకారం  రూ.370 కోట్లుగా ఉన్న ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రూ.3,300 కోట్లకు పెంచేశారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్‌టెక్‌ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు  2015 జూన్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్‌ డిజైన్‌ టెక్‌ కంపెనీలు తమ వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వనే లేదు.

ఏపీఎస్‌ఎస్‌డీసీ మాత్రం తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్‌ టెక్‌ కంపెనీకి రూ.371 కోట్లు విడుదల చేసేసింది. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేస్తూ రూ.371 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. అందుకోసం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నోట్‌ ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారు. 

షెల్‌ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు... 
డిజైన్‌ టెక్‌కు చెల్లించిన రూ.371 కోట్లను షెల్‌ కంపెనీల ద్వారా బోగస్‌ ఇన్వాయిస్‌లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగాతరలించారు. ప్రతిదశలోనూ షెల్‌ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు. 

ఫైళ్లు మాయం చేసిన కుంభకోణం గుట్టు రట్టు
2017లోనే  కేంద్ర జీఎస్టీ అధికారులు పుణెలోని పలు షెల్‌ కంపెనీల్లో నిర్వహించిన సోదాల్లో ఏపీఎస్‌ఎస్‌డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్‌లను గుర్తించి ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేయకుండా ఏసీబీని చంద్రబాబు అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు. 2019లో పుణెకి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో సిట్‌ నియమించింది.

సిట్‌ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. సీఐడీ అధికారులు జర్మనీలోని సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. డిజైన్‌ టెక్, ఇతర షెల్‌ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్‌ అధికారులు ఛేదించారు. స్కిల్‌ కుంభకోణానికి కర్త కర్మ క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది.  

చంద్రబాబుకు 17ఏ కింద రక్షణ లభించదన్న సుప్రీం కోర్టు 
స్కిల్‌ స్కామ్‌ కేసులో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన మాజీ సీఎం చంద్రబాబు ‘సెక్షన్‌ 17ఏ’ను సాకుగా చూపిస్తూ విచారణను అడ్డుకునేందుకు పన్నిన పన్నాగం బెడిసికొట్టింది. సెక్షన్‌ 17ఏను తనకు వర్తింపజేస్తూ తనపై స్కిల్‌ స్కామ్‌లో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

ఈ కేసును కేంద్ర జీఎస్టీ విజిలెన్స్‌ విభాగం 2017లోనే నమోదు చేసింది కాబట్టి  2018 నవంబరు నుంచి అమలులోకి సెక్షన్‌ 17ఏ చంద్రబాబుకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

స్కిల్‌ స్కామ్‌ ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86కోట్లు.. చంద్రబాబుపైఈడీ కన్ను 
మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. షెల్‌ కంపెనీల ద్వారా ఏ రాజకీయ పార్టీ అయినా అక్రమ నిధులు పొందితే అందుకు ఆ పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.  టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్‌ స్కామ్‌కు కూడా ఇది వర్తిస్తుందని ఈడీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎందుకంటే షెల్‌ కంపెనీల ద్వారా టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు మళ్లించినట్టు సీఐడీ ఆధారాలతోసహా నిర్ధారించింది.

హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో  టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు. జూబ్లీ హిల్స్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలు ఉన్నాయి. ఆ మూడు ఖాతాల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500  జమ చేశారు. హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్‌ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయినోట్ల కట్ల రూపంలో తీసుకువచ్చి మరీ జమ చేశారు. ఆ నిధులు తమకు ఎలా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించలేదు.  

కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దును 2016, నవంబరులో ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు అనుమతించింది. భారీ డిపాజిట్లకు ఆదాయ మార్గాలు వెల్లడించాలని పేర్కొంది. కానీ ఆదాయ మార్గాలను వెల్లడించకుండానే టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86కోట్లు జమ చేయడం గమనార్హం.  ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్కిల్‌స్కామ్‌లో చంద్రబాబును ఈడీ అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.  

సీఐడీ చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితులు
ఏ1: చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి 
ఏ2: కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి 
ఏ3: గంటా సుబ్బారావు, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీఎండీ–సీఈవో 
ఏ4: కె.లక్ష్మీనారాయణ, టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ డైరెక్టర్‌ 
ఏ5: సీమెన్స్, డిజైన్‌టెక్, పీవీఎస్‌పీ స్కిల్కర్‌ తదితర కంపెనీల అధికారులు 

Advertisement

తప్పక చదవండి

Advertisement