హయత్‌ నగర్‌లో దారుణం.. టీచర్‌ మందలించిందని విద్యార్థిని ఆత్మహత్య

26 Aug, 2022 14:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్‌లో 8వ తరగతి విద్యార్థిని అక్షయ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. హయత్ నగర్ ఆర్టీసీ  కాలనీలో ఉన్న శాంతినికేతన్ స్కూల్‌లో అక్షయ అనే విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్‌లో హోంవర్క్ చేయలేదని టీచర్‌ మందలించింది. అంతేగాక క్లాస్‌లో అల్లరి చేయడం గమనించిన టీచర్‌ అక్షయను తరగతి గది బయట మోకాళ్లపై నిల్చోబెట్టింది.

దీంతో తోటి విద్యార్థుల ముందు అవమానం జరిగిందని మనస్తాపం చెందిన విద్యార్థిని.. సాయంత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో  ఫ్యాన్‌కు ఉరేసుకుని అత్మ హత్య చేసుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు విగతా జీవిగా కనిపించడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

అయితే టీచర్‌ మందలించడం వల్లే అక్షయ చనిపోయిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. విద్యార్థిని మరణానికి స్కూల్‌ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పాప బంధువులు ఆగ్రహంతో స్కూల్‌పై రాళ్ల దాడి చేయడంతో  అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసమయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

మరిన్ని వార్తలు