హిప్పో సబ్బుల మాటున ‘మత్తు’ రవాణా

16 May, 2022 02:44 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న క్లోరోఫామ్‌

నిర్మల్‌ జిల్లాలో నిషేధిత మత్తు పదార్థం క్లోరోఫామ్‌ పట్టివేత

గుజరాత్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా తరలింపు

కల్లులో కలపడానికి విక్రయం 

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లాలో నిషేధిత మత్తు పదార్థం క్లోరోఫామ్‌ (సీహెచ్‌)ను రాష్ట్ర ఎక్సైజ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారులుభారీ ఎత్తున పట్టుకున్నారు. ఎవరికీ అను మానం రాకుండా హిప్పో డిటర్జెంట్‌ పేరిట గుజరాత్‌ లోని ఓ రసాయనాల ఫ్యాక్ట రీ నుంచి హైదరాబాద్‌కు అక్కడ్నుంచి జిల్లాలకు సర ఫరా చేస్తున్నట్లుగా సమాచారం అందడంతో ఆమేరకు అప్రమత్తమైన టాస్క్‌ ఫోర్స్‌ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

గుజరాత్‌లోని వాపిలో ఉన్న శ్రీ కెమికల్స్‌ ఫ్యాక్టరీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడ్నుంచి నిర్మల్‌కు నవత ట్రాన్స్‌పోర్టు వాహనంలో హిప్పో డిటర్జెంట్‌ పేరిట 20 బ్యాగుల్లో 560 కిలోల క్లోరోఫామ్‌ను రవాణా చేశారు. వీటిని తీసుకునేందుకు శనివారం నవత కార్యాలయానికి నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలం ధర్మోరకు చెందిన అరుణ్‌గౌడ్‌ వచ్చారు. అప్పటికే అక్కడి చేరుకున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అతడిని పట్టుకున్నారు.

కల్లులో కలిపేందుకు క్లోరోఫామ్‌ను ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లోని దాదాపు 50 గ్రామాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. క్లోరోఫామ్‌ కిలో రూ.వెయ్యి నుంచి రూ.ఐదువేల వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితుడు అరుణ్‌గౌడ్‌ను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. గతంలో ఇదే కేసులో రెండుసార్లు అరుణ్‌ గౌడ్‌ పోలీసులకు పట్టుబడటం గమనార్హం.

మరిన్ని వార్తలు