వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోతో లక్షలు.. | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటోతో లక్షలు కొట్టేశారు..

Published Fri, Nov 13 2020 8:20 AM

Cyberabad Police Arrested Two Cyber Criminals From Mumbai - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నకిలీ వాట్సాప్‌ ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి తమ్ముడూ.. వైద్య సేవల కోసం డబ్బులు అత్యవసరమంటూ మెసేజ్‌లు పంపించి మరీ పేట్‌బషీరాబాద్‌ వాసిని బోల్తా కొట్టించిన ముంబైకి చెందిన ఇద్దరు సైబర్‌ నేరగాళ్లను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, పాన్‌కార్డు, చెక్‌బుక్‌లు స్వాదీనం చేసుకున్నారు. ఈస్ట్ ‌ముంబైలోని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కె.బాలకృష్ణరెడ్డి తెలిపిన మేరకు.. పేట్‌బషీరాబాద్‌కు చెందిన బాలముకుంద్‌కు యూఎస్‌ఏలో ఉండే అతని తమ్ముడు మహేందర్‌ కుమార్‌ ఫొటోను వాట్సాప్‌ ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టి అత్యవసర వైద్య సేవల కోసం రూ.రెండు లక్షలుంటే ట్రాన్స్‌ఫర్‌ చేయమంటూ బ్యాంక్‌ ఖాతా నంబర్‌ను సైబర్‌ నేరగాళ్లు పంపించారు. చదవండి: తమిళనాడులో ట్రిపుల్‌ మర్డర్స్‌ సంచలనం

ఇది నిజమని నమ్మిన బాలముకుంద్‌ తన ఐసీఐసీఐ బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.రెండు లక్షలు పంపాడు. మళ్లీ ఎస్‌ఎంఎస్‌లు రావడంతో మరో రూ.లక్షను కూడా బదిలీ చేశాడు. ఆ తర్వాత తన తమ్ముడు మహేందర్‌ కుమార్‌కు ఫోన్‌కాల్‌ చేస్తే  తాను డబ్బు అడగలేదని చెప్పడంతో మోసపోయానని తెలుసుకున్నాడు. ఆ వెంటనే సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన టెక్నికల్‌ సాక్ష్యాలతో దీపక్‌ నందియాల్, మనీశ్‌ అమృత్‌లాల్‌లను ఈ నెల ఏడున అరెస్టు చేసి ఈస్ట్‌ ముంబైలోని న్యాయస్థానంలో హాజరుపరిచి బుధవారం సిటీకి తీసుకొచ్చారు. న్యాయస్థానంలో హాజరుపరిచి చర్లపల్లి జైలుకు తరలించారు.   

Advertisement
Advertisement