సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్‌ వాట్సాప్‌’! | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తు.. ‘పింక్‌ వాట్సాప్‌’!

Published Mon, Jun 12 2023 1:30 AM

Cybercriminals are coming up with new ways - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ద్వారా ప్రజల నుంచి భారీగా డబ్బు కాజేసేందుకు సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త మార్గాలను తెరపైకి తెస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగదారుల్లో అత్యధికం మంది ఉపయోగించే వాట్సాప్‌ ద్వారా మాల్‌వేర్‌లను చొప్పించే ప్రణాళికను ఇటీవల కాలంలో అమలు చేస్తున్నారు. ఆకుపచ్చ రంగులో కనిపించే వాట్సా­ప్‌... సరికొత్త ఫీచర్లతో గులాబీ రంగులో (పింక్‌) వచ్చిందంటూ బురిడీ కొట్టిస్తున్నారు.

ఇందుకోసం వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలంటూ సైబర్‌ నేరగాళ్లు లింక్‌లు పంపుతున్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఎస్‌ఎంఎస్‌లతోపాటు వాట్సా­ప్‌ మెసేజ్‌ల రూ­పం­లో ఈ లింక్‌లు పంపుతున్నట్లు తెలిపారు. ఎవరైనా ఈ లింక్‌లను క్లిక్‌ చేసి అది అడిగే అప్‌డేట్‌ కోసం ఫోన్‌ నంబర్, ఓటీపీ ఎంటర్‌ చేస్తే ఫోన్లోని ఫొటోలు, కాంటాక్ట్‌ నంబర్లు, బ్యాంకుల పాస్‌వర్డ్‌ల వంటి వివరాలన్నీ సైబ­ర్‌ నేరస్తుల చేతుల్లోకి వెళ్లిపోతాయని పోలీసులు చెబుతున్నారు.

అలాగే ఆయా వ్యక్తులు సభ్యులుగా ఉండే వాట్సాప్‌ గ్రూప్‌లలోకి ఆటోమేటిక్‌గా పింక్‌ వాట్సాప్‌ పేరిట లింక్‌లు షేర్‌ అవుతాయని పేర్కొన్నారు. కీబోర్డ్‌ ఆధారి­త మాల్‌వేర్‌లను పింక్‌ వాట్సాప్‌లోకి చొప్పించడం ద్వారా బ్యాంకు పాస్‌వర్డ్‌లను తస్కరించి సైబర్‌ నేరగాళ్లు డబ్బు కొట్టేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్ప­టికే పింక్‌ వాట్సాప్‌ పేరిట వచ్చిన లింక్‌లను ఓపెన్‌ చేసి ఎవరైనా ఇన్‌స్టాల్‌ చేసుకొని ఉంటే వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలని సూచిస్తు న్నారు.

అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తేనే ఆ నకిలీ లింక్‌లను షేర్‌ కాకుండా ఆపగలుగుతామని చెబుతున్నారు. ఒకవేళ మనకు తెలిసిన వారి నుంచి ఇలా పింక్‌ వాట్సాప్‌ పేరిట ఏవైనా మెసేజ్‌లు వస్తే వారిని వెంటనే అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు.  

Advertisement
Advertisement